Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన..
- రూర్కీ ఆస్పత్రిలోనూ ఐదుగురు మృతి
చెన్నై: దేశంలో ఆక్సిజన్ కొతర నేపథ్యంలో మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దేశంలోని పలు చోట్ల ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తమిళనాడులోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 13 మంది రోగులు ప్రాణాలు విడిచారు. వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని చెంగల్పట్టు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం నుంచి దాదాపు కనీసం 13 మంది రోగులు మరణించారు. వీరికి ఆక్సిజన్ అందకపోవడంతో పాటు ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కొంత మంది ఆస్పత్రి సిబ్బంది సైతం తాజాగా సంభవించిన మరణాలకు ఆక్సిజన్ కొరతే కారణమని పేర్కొన్నాయి. అయితే, ఈ మరణాలకు ఆక్సిజన్ కొరత కారణం కాదని అధికారులు చెబుతున్నారు. ఈ విషాదంపై చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ ఎ.జాన్ లూయిస్ మాట్లాడుతూ.. ద్రవ ఆక్సిజన్ ట్యాంకులో సాంకేతిక లోపం ఏర్పడింది. కానీ ఆస్పత్రిలో ఇదే కాకుండా 40 ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించి రోగులకు ఆక్సిజన్ అందించారు. తాజా మరణాలకు వారి అనారోగ్యమే కారణం'' అని అన్నారు. అయితే, ఆస్పత్రిలోని పలు వర్గాలు మాత్రం '' మంగళవారం సాయంత్రం 4 గంటలకు మెడికల్ ఐసీయూ సహా మూడు వేర్వేరు బ్లాకుల్లో మరణాలు సంభవించాయి. మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సాయంత్రం 4 గంటల వరకు రాలేదు. దీంతో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలిగింది'' అని పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, చాలా రోజుల నుంచి ఈ ఆస్పత్రికి ఆక్సిజన్ రెగ్యులర్‌గా అందడం లేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. సరఫరాదారులు చెంగల్పట్లు చుట్టుపక్కల ఉన్న ప్రయివేటు ఆస్పత్రులకే మొదటి ప్రాధాన్య ఇస్తూ.. తమకు ఆలస్యంగా ఆక్సిజన్ అందిస్తున్నారని తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా సమస్యను పరిష్కరించాలనీ, అలాగే, మానవ శక్తి కొరతను సైతం పరిష్యారించాలని అధికారులను కోరుతున్నారు.
రూర్కీలో ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో ఐదుగురు రోగులు మరణించిన ఘటన హరిద్వార్ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. రూర్కీ ఆజాద్‌నగర్‌లోని 85 పడకల కోవిడ్-19 ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోవడంతో తెల్లవారుజామున మార్చారు. దీంతో ఐదుగురు కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన జిల్లా మెజిస్ట్రేట్ దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.