Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్ మీడియాపై ప్రభుత్వ దాడికి ఖండన
- 161 రోజూ కొనసాగిన రైతు ఉద్యమం : ఎస్కేయం నేతల వెల్లడి
న్యూఢిల్లీ : మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం గురువారం నాటికి 161వ రోజుకు చేరుకుంది. సింఘు, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్పూర్ సరిహద్దు ప్రాంతాల్లో రైతు ఉద్యమం కొనసాగుతున్నది.
ప్రస్తుత రైతు ఉద్యమాన్ని కవర్ చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలు నిరంతరం ప్రభుత్వం దాడికి గురవుతున్నాయనీ, అంతకుముందు కిసాన్ ఏక్తా మోర్చా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలను తాత్కాలికంగా నిలిపివేశారని రైతు నేతలు విమర్శించారు.
నిరసన ప్రదేశాలలో ఇంటర్నెట్ను నిషేధించడం ద్వారా ప్రభుత్వం ఏకపక్ష ఎజెండాను ప్రదర్శించిందని విమర్శించారు. బుదవారం భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ట్విట్టర్ హ్యాండిల్ అమన్బాలీని సస్పెండ్ చేశారని అన్నారు. రైతుల ఉద్యమానికి నిరంతరం సహాయం చేస్తూ, కరోనా మహమ్మారిలో సాధారణ పౌరులకు సహాయం చేస్తున్న ఖల్సా ఎయిడ్ సీఈఓ రవి సింగ్ ఫేస్ బుక్ ఖాతా కూడా నిలిపివేతకు గురయిందని చెప్పారు. స్వతంత్ర జర్నలిజం, సామాజిక కార్యకర్తలపై ప్రభుత్వం చేసిన దాడిని తాము ఖండిస్తున్నామని, వ్యతిరేకిస్తున్నామని ఎస్కేఎం నేతలు పేర్కొన్నారు. ఈ ఖాతాలను వెంటనే తిరిగి పునరుద్ధరించాలని కోరారు. పంటకోత కాలం ముగియడంతో రైతులు ఢిల్లీ నిరసన ప్రదేశాలకు తిరిగి రావడం ప్రారంభించారని తెలిపారు.
తమ ట్రాక్టర్లలో పెద్ద సంఖ్యలో రైతులు సింఘు సరిహద్దుకు చేరుకున్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ సరిహద్దులకు మరింతమంది చేరుకుంటారనీ, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఎస్కెఎం నేతలు అన్నారు.
అజిత్ సింగ్ మృతికి నివాళి
భారత మాజీ వ్యవసాయ మంత్రి, రైతు నాయకుడు చౌదరి అజిత్ సింగ్ మృతికి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం) నివాళి అర్పించింది. అజిత్ సింగ్ రైతుల బాధలను ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ప్రతి దశలో ముందంజలో ఉంచారని కొనియాడింది. రైతు ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ఇచ్చారని తెలిపింది. ఎస్కెఎం నేతలు అభిమన్యు కోహర్, బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, గుర్నమ్ సింగ్ చారుని, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాన్, యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.