Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నేపథ్యంలో వారణాసి ప్రజల ఆగ్రహం
వారణాసి : ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధాని మోడీ ఎంపీగా పోటీచేసి గెలుపొందిన నియోజకవర్గం. కరోనా రెండో దశ విలయతాండవంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో వారణాసి కూడా ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అండగా ఉండి చర్యలు తీసుకోవాల్సిన ఎంపీ మోడీ తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మా ఎంపీ ఎక్కడున్నారు? అని ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు. రెండో దశలో వైరస్ విజృంభణతో నియోజక వర్గంలో వైద్య రంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఆక్సిజన్, అంబులెన్స్ సదుపాయాలు గగనం గా మారాయి. కరోనా పరీక్ష చేయించుకోవాలంటే దాదాపు వారం సమయం పడుతున్న దారుణ పరిస్థితి నెలకొంది. 10 రోజుల్లో అనేక ఫార్మసీల్లో కనీస మెడిసిన్ అయిన విటమిన్లు, జింక్, పారాసెటమాల్ మాత్రలు నిండుకున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సదుపాయం పొందేందుకు సాయం చేయాలని తమకు అనేక ఫోన్లు వస్తున్నాయని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక వైద్య నిపుణుడు పేర్కొన్నారు. బేసిక్ మెడిసిన్ సరఫరాలో కొరత ఉన్న నేపథ్యంలో ప్రజలు కాలం చెల్లిన ఔషధాలను తీసుకుంటున్న పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. రెండోదశ వ్యాప్తిలో భాగంగా ఢిల్లీ, ముంబయిలలో కేసులు పెరగడం, లాక్డౌన్లు పెట్టడంతో వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించారు. దీంతో రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల ద్వారా అనేక మంది వలస కార్మికులు వారణాసి, చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకున్నారు. మార్చి 29న జరిగిన పండుగ, గతనెల 18న జరిగిన పంచాయతీ ఎన్నికల కోసం వచ్చేశారు. నిపుణుల హెచ్చరికలకు విరుద్ధంగా నిర్వహించిన ఈ ఎన్నికల విధుల్లో రాష్ట్రవ్యాప్తంగా 700 మందికి పైగా టీచర్లు మరణించారు. ఈ ఎన్నికలే వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయన్న విమర్శలున్నాయి. వారణాసిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో లాక్డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 19న ఆదేశించింది. ఇందుకు తిరస్కరించిన రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాద్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వారణాసిలో ఇప్పటి వరకు 70,612 మంది కరోనా బారిన పడగా, 690 మంది మరణించారు.