Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెకండ్‌వేవ్ నియంత్రణలో విఫలం
- మూడో దశ కరోనాకి ఆక్సిజన్‌తో సిద్ధంకావాలని సలహా
న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికలపై సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. సెకండ్వేవ్నే అడ్డుకోలేకపోయారు? థర్డ్‌వేవ్ ను ఎలా ఎదుర్కొంటారంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి మూడో దశ ప్రభంజనం మరింత వికృతంగా ఉండబోతోందని హెచ్చరికలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు అప్రమత్తం చేసింది. ఇప్పుడు సిద్ధమైతే రాబోయే ప్రభంజనాన్ని ధీటుగా ఎదుర్కొనగలుగుతామని తెలిపింది. ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ పంపిణీ విధానాన్ని సమీక్షించుకోవాలని పేర్కొంది. ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతత్వంలోని ధర్మాసనం గురువారం ఈ సలహా ఇచ్చింది. ఢిల్లీలోని కోవిడ్ రోగులకు రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళికను సుప్రీం కోర్టు పరిశీలించింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్‌ను ఉపయోగించే ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రుల్లో అధ్యయనం జరిగిందనీ, ఆస్పత్రుల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఆక్సిజన్ నిల్వ ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు.
జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. ఇప్పుడు మనం చేయవలసినది యావత్తు భారత దేశం అవసరాలకు తగిన ప్రణాళికను రూపొందించటమని చెప్పారు. ఆక్సిజన్ ఆడిట్ జరగాలనీ, ఆక్సిజన్ కేటాయింపుల కోసం ప్రాతిపదికను మరోసారి మదింపు చేయవలసిన అవసరం ఉందని స్పష్టమవుతోందన్నారు. ఇప్పుడు మనం కోవిడ్-19 మహమ్మారి రెండో దశలో ఉన్నామని, రాబోయే మూడో దశ మరింత విభిన్నంగా ఉండవచ్చునని అన్నారు. మనం ఇప్పుడే సిద్ధమైతే మూడో దశను ఎదుర్కొనగలుగుతామని చెప్పారు. ఓ రాష్ట్రానికి ఆక్సిజన్‌ను కేటాయించడం గురించి మాత్రమే కాదని, సరైన రీతిలో ఆక్సిజన్ ఆడిట్ జరగడం కూడా ముఖ్యమైనదేనని చెప్పారు. ఆక్సిజన్ పంపిణీకి సరైన మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. అందుకే మిగిలిన రాష్ట్రాల గురించి కూడా చూడాలని చెప్పానన్నారు.
కేరళలో రేపటి నుంచి లాక్డౌన్
దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతుండగా.. పలు రాష్ట్రాలు లాక్డౌన్ బాట పడుతున్నాయి. ఇప్పుడు ఆ రాష్ట్రాల జాబితాలో కేరళ కూడా చేరింది. రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. 8 నుంచి 16 వరకు రాష్ట్రం లాక్డౌన్లో ఉండనున్నదని గురువారం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయంం 5 గంటల వరకు కర్ఫ్యూ నడుస్తున్నది. గడిచిన 24 గంటల్లో కేరళలో సుమారు 42 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి విదితమే.
మయన్మార్‌లో వార్తా సంస్థలపై ఆగని అణచివేత చర్యలు
శాటిలైట్ టీవీపై పూర్తి నిషేధం
మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కుప్పకూల్చి అధికా రాన్ని చేజిక్కించుకున్న జుంటా సైన్యం మరోసారి వార్తా సంస్థలపై విరుచుకుపడింది. అక్కడ జరుగు తున్న హింసాకాండను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్న స్వతంత్ర వార్తా సంస్థలను కట్టడి చేసేందుకు శాటిలైట్ టీవీని పూర్తిగా నిషేధించింది. శాటిలైట్ డిష్‌లను వాడే ఎవరిపైనైనా సరే భారీ జరిమానాలతో పాటు శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఎవరైనా శాటిలైట్ డిష్‌లను వాడుతూ టీవీలను చూస్తున్నట్లయితే 500,000 క్యాత్ (320 డాలర్లు) జరిమానా లేదా ఏడాది పాటు జైలు శిక్ష తప్పదని స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ ఇప్పటికే ప్రకటన చేసింది. కొన్ని అక్రమ సంస్థలు, వార్తా సంస్థలు..శాటిలైట్ ద్వారా ఇక్కడి భద్రతా దళాలపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయంటూ మిలటరీ ఆరోపించింది. అదేవిధంగా మీడియా, అంతర్జాలంపై నిబంధనలు విధించింది. డెమొక్రటిక్ వాయిస్ ఆఫ్ బర్మా (డీవీబీ, మిజిమా వంటి స్వతంత్ర సంస్థలను లక్ష్యంగా చేసుకుని శాటిలైట్ టివిపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టమౌతోంది. మార్చిలో వీటి లైసెన్సును జుంటా సైన్యం రద్దు చేసినప్పటికీ...శాటిలైట్స్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ నిషేధం కారణంగా విదేశీ వార్తా సంస్థలపై కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఈ నెల 4న రెండు వార్తా సంస్థలపై నిషేధం విధించింది. ఈ అణచివేత చర్యలపై పలువురు సైన్యంపై విమర్శలు గుప్పిస్తు న్నారు. ఈ చర్యపై మానవ హక్కుల పరిశీలన లీగల్ అడ్వైజర్ లిండా లఖ్దీర్ తీవ్రంగా ఖండించారు. శాటిలైట్ టివి నిషేధం స్థానిక స్వతంత్ర దర్యాప్తు సంస్థల ను అణచివేసి..ప్రజలను మరింత ఒంటరిని చేయాలని సైన్యం చూస్తోందని మండిపడ్డారు. తక్షణమే ఈ చర్యను సైన్యం ఉపసంహరించుకోవాలని, న్యూస్ రిపోర్టింగ్‌పై దాడిని ముగించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని కూల్చివేసి...ప్రధాని అంగన్సూకీని అదుపులోకి తీసుకున్న జుంటా సైన్యం...తనను వ్యతిరేకిస్తున్న ప్రజల పట్ల దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు 71 మంది జర్నలిస్టులను అరెస్టు చేయగా...48 మందిని నిర్బంధించింది.