Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టరేట్ (విశాఖ) : విశాఖ ఎల్జి పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడిన, ఆర్థికంగా నష్టపోయిన వారందరినీ ఆదుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు డిమాండ్ చేశారు. ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ సంఘటన జరిగి ఏడాదైన సందర్భంగా శుక్రవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గంగారావు మాట్లాడుతూ గ్యాస్ లీకేజ్ ఘటన జరిగి ఏడాది కావస్తున్నా బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. ఇందులో పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించాలని, కంపెనీ యాజమాన్యం బాధితుల ఆరోగ్యానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హైపవర్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఎల్జి పాలిమర్స్ కంపెనీని ఇక్కడ నుంచి తరలించాలని, ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఎం మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి.కృష్ణారావు, సిఐటియు నగర అధ్యక్షుడు ఆర్‌కెఎస్‌వి.కుమార్, కార్యదర్శి బి.జగన్, పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కో- కన్వీనర్ కుమార మంగళం తదితరులు పాల్గొన్నారు.