Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారికోసం లక్షల రూపాయల క్రౌడ్‌ఫండింగ్!
- కోవిడ్ కల్లోలంలో మరో కోణం
ముంబయి: కోవిడ్ కల్లోలంతో రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, మరణాలతో దేశంలో పరిస్థితి భయానకంగా వుంది. ఢిల్లీ, ముంబయి వంటి మహా నగరాల్లోని శ్మశానాల్లో కాటికాపరులకు అసలు ఖాళీ వుండడం లేదు. ఒక శవానికి దహన సంస్కారాలు చేస్తుంటే వెనక మరో డజను శవాలు క్యూలో ఉంటున్నాయని 30 ఏళ్ల కాటికాపరి రామ్‌కరణ్ మిశ్రా వ్యాఖ్యానించారు. పైగా శ్మశానాలు కూడా జన సమూహాలుగా మారిపోతున్నాయి. భౌతిక దూరం పాటించడం లేదు, శానిటైజర్లు లేవు, పరిస్థితి చాలా భయంకరంగా వుందని మిశ్రా థామ్సన్ రాయటర్స్ ఫౌండేషన్‌కు తెలిపారు. ఇంతా చేసి ఆ కాటికాపరికి రోజుకు చెల్లించేది రూ.400. వాళ్లు 24గంటలు ఎదుర్కొనే ముప్పుకు ఇది నామమాత్రపు చెల్లింపే. అటువంటి కాటికాపరులకు కాస్తయినా సాయపడేందుకు దేశ రాజధానిలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్ నందిని ఘోష్ క్రౌడ్‌ఫండింగ్ ఇనీషియేటివ్‌కు గత ఆదివారం రూపకల్పన చేశారు. ఒక శ్మశానంలో వందమంది వర్కర్లకు ఆహార పంపిణీతో ప్రారంభించి, ఒక మంచి సంస్థగా నెలకొల్పారు. 48 గంటల్లోనే రు.15లక్షల మేరకు సొమ్ము పోగైంది. క్రౌడ్ ఫండింగ్ గురించి పూర్తిగా తెలుసుకుని నందిని ఘోష్ ఇందులో దిగకపోయినా వెనువెంటనే మొత్తంగా అన్ని రకాల చర్యలు, కార్యక్రమాలు చకాచకా నిర్వహించడానికి పూర్తిగా అంకితమయ్యారు. అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ వంటివి చేపట్టారు. శానిటైజర్లు, తాగునీరు, వాటర్ కూలర్లు వంటి వాటి కోసం ఆమె తాజాగా విజ్ఞప్తులు పంపుతున్నారు. మరణించిన వారి బంధువుల కోసం అక్కడ బెంచీలు వంటివి ఏర్పాటు చేయిస్తే వారు కూర్చోవడానికి లేదా శవాలను పెట్టడానికైనా వీలు వుంటుందని ఆ దిశగా ఆలోచిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఎనిమిది శ్మశాన వాటికల్లోని వర్కర్లను ఆమె బృందాలు సంప్రదించాయి.
కరోనా సంక్షోభానికి ముందు రోజుకు ఎనిమిది వరకు వచ్చే శవాలు ప్రస్తుతం వంద నుండి 150వరకు వస్తున్నాయని వారు చెప్పారు. వారాల తరబడి విశ్రాంతి అనేది లేకుండా మండే ఎండలను తట్టుకుంటూ వీరు తమ పనులను సాగిస్తున్నారు. ఇంతలా కష్టపడుతున్న వారిని చూసి అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే వుంటారు. వారికి ఉద్యోగభద్రత లేదు, సామాజిక భద్రత లేదు, వారు చేసే పని తప్ప ప్రపంచానికి వారు కనిపించరని అంబేద్కర్ దళిత సంఘర్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ శంకర్ వ్యాఖ్యానించారు. ఘోష్ ఇనీషియేటివ్‌ను క్రౌడ్‌ఫండింగ్ వేదికైన మిలాప్ ప్రచురించింది. ఘోష్ ఎంపిక చేసుకున్న సైట్ ప్రతి 20నిముషాలకు ఒకసారి కోవిడ్ రిలీఫ్ ప్రచారాన్ని చేస్తుంది. ఈ సెకండ్ వేవ్ సమయంలో వెబ్‌పేజీ వీక్షించే వారి సంఖ్య 65శాతం పెరిగింది. మిలాప్, గివ్ ఇండియాతో సహా పలు వేదికలు ఇటువంటి క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాలు చేపట్టాయి. దాదాపు నాలుగు లక్షల మంది నుంచి రూ.145కోట్ల విలువ చేసే విరాళాలను మిలాప్ నమోదు చేసింది. వీటిల్లో రేషన్ కిట్లు, పిపిఇ కిట్లు, వెంటిలేటర్లు, భోజనం పార్శిల్స్ ఉన్నాయి. గివ్ ఇండియా ప్లాట్ఫారం రూ.276కోట్ల విరాళాలను సేకరించింది. కెట్టొ వేదిక రూ.320 కోట్లను సమీకరించిందని వారి వెబ్సైట్ల డేటా తెలియజేస్తోంది.