Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని ఫోన్ సంభాషణపై జార్ఘండ్ సీఎం సోరెన్ ట్వీట్
- మహమ్మారిని ఎదుర్కొనేందుకు మోడీకి అండగా ఉండాలి : జగన్ ట్వీట్
రాంచీ : ప్రధాని మోడీ తన మనసులో ఉన్నది మాట్లాడటం తప్ప తాము చెప్పేది వినడం లేదని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విమర్శించారు. కరోనా పరిస్థితులపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు ఒడిశా, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులతో, పాండిచ్చేరి, జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఫోన్ చేసి మాట్లాడారు. సోరెన్ తన ట్విట్టర్లో గురువారం రాత్రి ఇలా రాశారు. 'ఈరోజు ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన కేవలం తన మనసులోని మాటను బయటపెట్టారు. చేయాల్సిన పనులతోపాటు మేం చెప్పే అంశాలు కూడా విని ఉంటే బాగుండేది' అని పేర్కొన్నారు. 'రాష్ట్రం యొక్క పరిస్థితి గురించి, రాష్ట్రానికి కావాల్సిన వనరుల గురించి మోడీ ఏమీ అడగలేదు. అవసరమైన ఔషధాలు లేక జార్ఘండ్ కష్టాలు పడుతోంది. ప్రధాని మాట్లాడటం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనమేమీ లేదు. అందువల్లే ఇలా ట్వీట్ చేశారు' అని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
మోడీకి అండగా ఉందాం : సిఎం జగన్
హేమంత్ సోరెన్ ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కరోనా కష్టకాలంలో మోడీకి అండగా ఉందాం అని సోరెన్‌కు విజ్ఞప్తి చేశారు. 'మీ పట్ల నాకు చాలా గౌరవం ఉంది, కానీ ఒక సోదరుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మన మధ్య విభేదాలు ఏమైనప్పటికీ, ఇలాంటి రాజకీయాలు కేవలం మన సొంత దేశాన్ని బలహీనం చేస్తాయి' అని శుక్రవారం జగన్ ట్వీట్ చేశారు. 'కోవిడ్-19కి వ్యతిరేకంగా యుద్ధంలో, ఒకరిపై ఒకరు వేళ్లు చూపించకుండా, ఒకరికి ఒకరి కలిసివచ్చి, మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రధాని మోడీని బలోపేతం చేయాల్సిన సమయం' అని జగన్ మరో ట్వీట్ చేశారు.
జగన్ ట్వీట్లపై విమర్శలు
దేశంలో కరోనా రెండో దశ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని కొన్ని నెలల ముందుగానే కేంద్రం నియమించిన ప్రత్యేక కమిటీ తెలిపినప్పటికీ మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించడంతోపాటు ప్రతి రోజూ లక్షలాదిమంది పాల్గొన్న ఉత్తరాఖండ్‌లోని కుంభమేళా జయప్రదానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం అన్ని చర్యలు తీసుకుంది. ఈ కార్యక్రమాలతో కరోనా రెండో దశ మరింత వేగవంతమైందని అంతర్జాతీయ మీడియా సైతం తీవ్ర విమర్శలు చేసింది. ఈ తరుణంలో రాష్ట్రాలకు కావాల్సిన సహకారంపై నేటికీ మోడీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. 45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ రాష్ట్రాలే ఉత్పత్తి సంస్థల నుంచి అధిక ధరకు కొనుగోలు చేయాలంటూ మోడీ ప్రభుత్వం తన బాధ్యతల నుంచి చేతులెత్తేసింది. అయినప్పటికీ, మోడీని బలోపేతం చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.