Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీబీఎంపీలో లోగుట్టును బయటపెట్టిన బీజేపీ ఎంపీ తేజస్వీ
- ఇరకాటంలో అధికార బీజేపీ.. దర్యాప్తునకు సీఎం ఆదేశం
బెంగళూరు : దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. బెడ్లు దొరకక, ఆక్సిజన్ అందక, వ్యాక్సిన్లు కానరాక కోవిడ్ పేషేంట్లు ఇబ్బందులు పడుతున్న సంఘటనలు కోకొల్లలు. అయితే, అధిక కేసులతో అతలాకుతలం అవుతున్న కర్నాటక రాజధాని బెంగళూరులో 'కోవిడ్ బెడ్ స్కాం' సంచలనంగా మారింది. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) పరిధిలోని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు కేటాయించే బెడ్లు 'బ్లాక్' అవుతున్న విషయాన్ని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, అదే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బయటపెట్టారు. బెడ్లను కావాలనే బ్లాక్ చేసి డబ్బు తీసుకొని వీటిని వేరేవారికి కేటాయిస్తున్న విషయాన్ని వీరు వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ విషయం బయటపడటంతో యడియూరప్ప సర్కారు ఉలిక్కిపడింది. ఈ అంశంపై దర్యాప్తు జరపాలంటూ కర్నాటక క్రైం బ్రాంచ్ పోలీసులను ఆయన ఆదేశించారు.
కరోనా కేసులు రాష్ట్రంలో దారుణంగా పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో సొంత పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల నుంచే ఇలాంటి ఫిర్యాదులు అందడం అధికార బీజేపీకి ఇబ్బందిగా మారింది. దీంతో బీజేపీ నాయకులు తేజస్వీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనూ, బీబీఎంపీ లోనూ అధికారం బీజేపీ చేతిలోనే ఉండటం.. బెడ్స్కాం బయటకు రావడంతో ప్రతిపక్షపార్టీలకు ఇది ఆయుధంగా మారింది. కరోనా రోగులకు బెడ్ కేటాయింపుల విషయంలో బీజేపీ ప్రభుత్వ అవినీతిని బయటకు తీసుకొచ్చిన తేజస్వీ సూర్యను కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అభినందించారు. ఈ విషయంలో బీజేపీ మంత్రిని తక్షణమే బాధ్యుడిగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఈ స్కాంకు తేజస్వీ సూర్య మతం రంగు పులిమే ప్రయత్నం చేశారు. బీబీఎంపీలో ఓ మతానికి చెందిన 17 మంది వర్కర్లు ఉండటంపై తేజస్వీ సూర్యతో పాటు బీజేపీ ఇద్దరు ఎమ్మెల్యేలు బీబీఎంపీ కార్మికులను ప్రశ్నించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిని స్వయంగా తేజస్వీ టీం విడుదల చేసింది. అయితే, ప్రస్తుత అంశానికి మతం కోణాన్ని తీసుకురావడం దురదృష్టకరమని తేజస్వీ సూర్య తీరును కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పుబట్టారు.