Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వైరస్ మహమ్మారి దేశంపై విరుచుకుపడుతున్నది. చిన్నా.. పెద్దా తేడాల లేకుండా ప్రజలు వైరస్ బారినపడుతున్నారు. దేశంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదువుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,14,188 కొత్త కేసులు వెలుగుచూశాయి. భారత్‌లో రోజువారీ కేసుల్లో ఇదే గరిష్ట సంఖ్య. దేశంలో 4 లక్షల దాటి కేసులు నమోదు కావటం వరుసగా ఇది రెండో రోజు. గత 24 గంటల్లో మరణాలు కూడా అదే స్థాయిలో రికార్డు అవుతున్నాయి. 3,915 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఇప్పటి వరకు దేశంలో 2,14,91,598 మంది కరోనా బారిన పడగా 2,34,083 మంది బలయ్యారు. రోజులో 3,31,507 మంది కోలుకోగా...మొత్తంగా 1,76,12,351 మంది చికిత్స పొంది ఇండ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో 36,45,164 యాక్టివ్ కేసులున్నాయి. తొలి వేవ్ మొదలైనప్పటి నుంచి దేశ ఆర్థిక నగరాన్ని రాజధానిగా కలిగి ఉన్న మహారాష్ట్రను మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఇక్కడే అత్యధిక కేసులు నమోదౌతున్నాయి. మహారాష్ట్రలో 62,194 కేసులు నమోదు కాగా, కర్ణాటక 49,058 కేసులు, కేరళలో 42,464, ఉత్తరప్రదేశ్‌లో 26,622, తమిళనాడులో 24,898 కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే రోజుకు 15.2 శాతం కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. రోజువారీ మరణాల్లో కూడా ఈ రాష్ట్రమే (853) ముందజలో ఉంది. దీని తర్వాత ఉత్తరప్రదేశ్‌లో (350) నిలుస్తోంది.
ఫొటో గుర్తింపు మార్గదర్శకాలు
ఫొటో గుర్తింపు కార్డులు లేనివారికి వ్యాక్సినేషన్ చేసేందుకు మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఇటువంటివారి పేర్లను కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసే బాధ్యతను జిల్లా టాస్క్‌ఫోర్స్‌లకు అప్పగించింది. జైలు అధికారులు, వద్ధాశ్రమాల ప్రతినిధులు వంటివారు ప్రధాన ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తూ బిచ్చగాళ్ళకు, జైలులో నిర్బంధంలో ఉన్నవారికి వ్యాక్సినేషన్ చేయించవచ్చునని తెలిపింది. మానసిక చికిత్సాలయాల్లో చికిత్స పొందుతున్నవారు, వద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నవారు, బిచ్చగాళ్లు, పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నవారు, ప్రభుత్వం నిర్దేశించిన ఏడు ఫొటో ఐడి కార్డుల్లో కనీసం ఒకటి అయినా లేని ఇతరులకు ఈ విధానంలో వ్యాక్సినేషన్ చేస్తారు.
కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మతి
అండర్ వరల్డ్ డాన్ రాజేంద్ర నికల్జే అలియాస్ చోటా రాజన్ (61) కరోనాతో మృతిచెందారు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గత కొన్నిరోజులుగా ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన పరిస్థితి విషమించడంతో మృతిచెందారు.. గత సోమవారం చోటా రాజన్ కరోనా లక్షణాలు ఉన్నాయంటూ తీహార్ జైలు అసిస్టెంట్ జైలర్ టెలిఫోన్ ద్వారా అక్కడి సెషన్స్ కోర్టుకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్యాంగ్‌స్టర్ ను కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించి ఎయిమ్స్‌లో చేర్పించారు.