Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తయారీ.. సహా వివిధ రంగాల్లో దెబ్బతిన్న ఉపాధి
- ఐదేండ్లలో 46శాతం ఉద్యోగాలు ఊడాయి : సీఈడీఏ-సీఎంఐఈ నివేదిక
- నేలచూపులు చూస్తున్న రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, మైనింగ్
- సంక్షోభ సమయాన కోట్లాదిమందికి ఉపాధి చూపిన వ్యవసాయం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ సృష్టించిన పెను విపత్తులో దేశం యావత్తు గజగజ వణికిపోతోంది. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందోననే భయం వెంటాడుతోంది. ఉపాధి, వ్యక్తిగత, కుటుంబ ఆదాయాలపై కోవిడ్-19 కోలుకోలేనంత దెబ్బతీసింది. అయితే కరోనాకంటే ముందే దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైందని, గత ఐదేండ్లుగా తయారీ, రియల్ ఎస్టేట్, మైనింగ్, ప్రభుత్వ సేవలు..తదితర రంగాల్లో ఉపాధి క్షీణించిందని 'సీఈడీఏ-సీఎంఐఈ' తాజా గా ఒక నివేదికను విడుదల చేసింది. అశోకా వర్సిటీ (హర్యానా)కి చెందిన 'సెం టర్ ఫర్ ఎకానమిక్ డాటా అండ్ ఎనాల సిస్' (సీఈడీఏ), సీఎంఐఈ సంయుక్తంగా ఒక బులెటిన్ విడుదల చేశాయి. గత ఐదేండ్లుగా ఆయా రంగాలవారీ గణాం కాల్ని రూపొందించాయి. ఇందులో పేర్కొ న్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి.. దేశవ్యాప్తంగా ఉపాధి, నిరుద్యోగం తదితర అంశాలపై సీఎంఐఈ ప్రతినెలా కచ్చిత మైన గణాంకాల్ని విడుదల చేస్తోంది. గత ఐదేండ్ల గణాంకాల్ని తీసుకొని 'సీఈడీఏ- సీఎంఐఈ' సంయుక్తంగా అధ్యయనం చేశాయి. మనదేశంలో 99శాతం ఉపాధి వ్యవసాయం, మైనింగ్, తయారీరంగం, రియల్ ఎస్టేట్, నిర్మాణరంగం, ఆర్థిక సేవలు, ఆర్థికేతర సేవలు, ప్రభుత్వరంగ సేవలు..ఈ ఏడు రంగాల్లో నెలకొని ఉంది. ప్రముఖ ఆర్థికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు ఈ గణాంకాల్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఆదుకున్న వ్యవసాయం..
ఐదేండ్ల క్రితం (2016-17) వ్యవసాయరంగంలో 14.56కోట్లమంది ఉపాధి పొందగా, ఇప్పుడు (2020-21) అది 15.18కోట్లమందికి ఉపాధి కల్పిస్తోంది. వృద్ధి 4శాతం నమోదైంది. మొత్తంగా ఉపాధి పొందుతున్నవారిలో 36శాతం వ్యవసాయరంగంలో ఉండగా, అదిప్పుడు 40శాతానికి పెరిగింది. ఈ రంగంలో ఉపాధి వృద్ధి గత రెండేండ్లలో వరుసగా 1.7శాతం, 4.1శాతం నమోదైంది. ఆర్థికేతర సేవల విభాగంలో ఉపాధి పొందుతున్నవారి సంఖ్య 11.97కోట్ల నుంచి 12.77కోట్ల (2020-21)కు పెరిగింది. అలాగే ఆర్థిక సేవల విభాగంలో 53లక్షల నుంచి 58లక్షలకు పెరిగింది. ప్రభుత్వ పాలనారంగంలో ఉపాధి పొందుతున్నవారి సంఖ్య 98లక్షల (2016-17) నుంచి 79లక్షలకు (2020-21)కు తగ్గింది.
ప్రమాద ఘంటికలు..
దేశ జీడీపీలో తయారీరంగం వాటా 17శాతం. ఆర్థిక ముఖచిత్రాన్ని తెలిపే ప్రధానరంగం ఇది. అయితే గత ఐదేండ్లుగా ఈ రంగం క్షీణిస్తూ వస్తోంది. 2016-17లో 5.1కోట్లమందికి ఈ రంగం ఉపాధి కల్పించగా, ఇప్పుడు ఆ సంఖ్య 2.73కోట్లకు పడిపోయింది. కరోనాకు ముందే దేశంలో ఉపాధి సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తున్న గణాంకమిది. అలాగే రియల్ ఎస్టేట్, నిర్మాణరంగాల్లోనూ ఉపాధి క్షీణిస్తూ వస్తోంది. ఈ రెండు రంగాల్లో ఉపాధి పొందేవారి సంఖ్య 6.9కోట్ల నుంచి 5.37కోట్లకు పడిపోయింది. ఈ రంగాల్లో ఉపాధి దాదాపు 25శాతం క్షీణించింది. కరోనా సంక్షోభం తలెత్తాక గత ఏడాది నుంచి ఈ రంగాలు మరిన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ప్రాజెక్ట్ పెట్టుబడి, అభివృద్ధి పూర్తిగా దెబ్బతిన్నాయి. 2004-11మధ్యకాలంలో దేశ ఆర్థిక వృద్ధిని రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా ప్రభావితం చేసింది. అయితే ఈ ట్రెండ్ ఆ తర్వాత కాలంలో కొనసాగలేదు. ఇక మైనింగ్ రంగంలో ఉపాధి గత ఐదేండ్లలో 38శాతం క్షీణించింది. ఉపాధి పొందేవారు సంఖ్య 14లక్షల నుంచి 8.8లక్షలకు పడిపోయింది. ఆర్థికమాంద్యం తలెత్తటంతో ఉక్కు, విద్యుత్, నిర్మాణరంగ పరిశ్రమల్లో కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఆ ప్రభావం మైనింగ్‌పై పడిందని నిపుణులు చెబుతున్నారు.
దేశ జీడీపీ(స్థూల దేశీయో త్పత్తి)లో తయారీరంగం వాటా 17శాతం. గతఐదేండ్లుగా తయా రీరంగం నేలచూపులు చూ స్తోంది. ఈ రంగంలో ఐదేండ్ల క్రితం 5.1కోట్లమంది ఉపాధి పొందితే, నేడు (2020-21) 2.73కోట్లకు పడిపోయింది. ఈ ట్రెండ్ కరోనాకు ముందు నుంచే ఉంది. ఈ సంక్షోభ సమయాన అనేకమందికి ఉపాధి కల్పిస్తూ.. వ్యవసాయరంగం దేశాన్ని ఆదుకుంది. అయితే దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని ప్రభావితం చేసే వివిధ రంగాలు నేల చూపులు చూస్తున్నాయి.
- సీఈడీఏ-సీఎంఐఈ
అధ్యయనంలో పరిశోధకులు