Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. దీంతో ఆస్పత్రుల్లో పడకలు, మందులు, టీకాలు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కనీస వైద్యం అందక ఆస్పత్రుల్లో ముందే నిత్యం వందలాది మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దీనికి ప్రభుత్వ ముందుస్తు చర్యలు తీసుకోకపోవడమే కారణమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిజన్, కరోనా చికిత్స మందుల వినతులతో సోషల్ మీడియా సందేశాలు మిన్నంటుతున్నాయి. అయితే, ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశంలోని అనేక మసీదులు కోవిడ్-19 కేంద్రాలుగా మారి ప్రజల ప్రాణాలు నిలుపుతున్నాయి.
తీవ్రమైన పడకల కొరత
దేశరాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబయి సహా అనేక ప్రాంతాల్లో నేడు పడకలు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి భారత్‌కు భారీ స్థాయిలో పడకలు అవసరం అవుతాయనీ, ప్రస్తుతం 5 లక్షల ఐసీయూ పడకలు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ప్రస్తుతం సుమారు 95 వేల ఐసీయూ పడకలు ఉన్నాయని సెంటర్ ఫర్ డిసీజ్డైనమిక్స్,ఎకానమిక్స్ అండ్ పాలసీ వెల్లడించింది. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ఏకంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగి ఆక్సిజన్ ఆడిట్ కోసం నిపుణుల కమిటినీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
మానవత్వాన్ని చాటుతూ..
కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో అనేక మసీదులు, గురుద్వారాలు సహా అనేక ప్రార్థనా స్థలాలు కరోనా వైద్య సదుపాయాలతో పాటు తామకు చేతనైనంత సాయం అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. వీటిలో ఇప్పటికే అనేక కోవిడ్-19 కేంద్రాలుగా మారాయి. గుజరాత్‌లోని బరోడాలో ఉన్న ఓ మసీదు కరోనా సెంటర్‌గా మారి రోగులకు సేవలు అందిస్తున్నదని నిర్వాహాకులు ముఫ్తీ ఆరీఫ్ ఫలాహి తెలిపారు. ప్రస్తుతం ఇందులో 142 మందికి ఆక్సిజన్ సపోర్టుతో సేవలు అందిస్తున్నామన్నారు. తాము వీలైనంత ఎక్కువ మందికి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ తాము ఆక్సిజన్ సేకరించడానికి తీవ్రంగా కష్టపడుతున్నామని తెలిపారు. ఇక్కడ వైద్యం అందిస్తున్న డాక్టర్ జయకర్ చట్రాబుజీ మాట్లాడుతూ.. ''ఇది నిజంగా ఒత్తిడితో కూడిన పరిస్థితి. నిత్యం 20 గంటలకు పైగా పనిచేయడంతో నిద్రించడానికి కూడా సమయం లేకుండా ఉంది. అయినప్పటికీ ప్రజలకు సహాయం చేయడం సంతృప్తిగా ఉంది. ఇక్కడ ఎంతో మంది పేదలు వైద్యం అందుకుంటున్నారు'' అని తెలిపారు.
అలాగే, జహంగీర్పూరా మసీదు సైతం 50 పడకల కోవిడ్-19 సెంటర్‌గా మారి వైద్య సహాయం అందిస్తోంది. ప్రజలకు సాయం చేయడానికి మనమందరం కలిసి ముందుకు రావాల్సిన సమయమిదని మసీదు ధర్మకర్త మహమ్మద్ ఇర్ఫాన్ అన్నారు. ముంబయికి చెందిన ఎన్జీవో రెడ్ క్రెసెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర అంతటా 20 మసీదులలో ఆక్సిజన్ సిలిండర్ల సేవలను అందిస్తోంది. నిత్యం 20 వేలకు పైగా ఆక్సిజన్ సంబంధిత కాల్స్ వస్తున్నాయంది. ఉత్తరప్రదేశ్‌లోనూ సేవలు విస్తరించబోతు న్నామంది. ప్రస్తుత సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటానికి దేశవ్యాప్తంగా ఉన్న 5.50 లక్షల మసీదులు, మత బోధన స్థలాలను కోవిడ్ సెంటర్లు గా మార్చి సేవలు అందించాలని ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన బోధకుడు మౌలానా ఉమర్ అహ్మద్ ఇలియాస్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో 20 మసీదులు కోవిడ్-19 కేంద్రాలుగా మార్చడానికి నిర్ణయించారు. కర్నాటకలోని అనేక మసీదులు కోవిడ్ రోగులకు సేవలు అందిస్తున్నాయి. దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై ఢిల్లీకి చెందిన ఎపిడెమియాలజిస్ట్, ప్రముఖ ఆరోగ్య నిపుణులు డాక్టర్ లలిత్ కాంత్ మాట్లాడుతూ.. కరోనా కట్టడి, ప్రజలకు వైద్య సదుపాయాలు అందించడంలో అధికార యాంత్రాంగం విఫలమైంది. ఈ క్రమంలోనే ప్రజల చొరవ తీసుకుని కోవిడ్ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో వారి సేవలు స్వాగతించదగినవని అన్నారు.