Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటల పాటు ఒక ఊరి నుంచి మరొక ఊరికి తిరిగిన బాధిత కుటుంబం
- జార్ఖండ్లో ఘటన
రాంచీ : దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ఎందరో ప్రజలు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే, ఇంతటి ప్రమాదకర సమయంలో కరోనా బాధితులు, బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన మనుషులు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు. మహమ్మారితో మరణించిన మనిషికి అంత్యక్రియలు కూడా సొంత గ్రామంలో నిర్వహించుకోలేని పరిస్థితి బాధిత కుటుంబాలకు ఏర్పడుతున్నది. సరిగ్గా ఇలాంటి ఒక ఘటనే ఇటీవల జార్ఖండ్లో చోటు చేసుకున్నది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్లా జిల్లాలోని సర్దార్ ఆస్పత్రిలో ఒక వ్యక్తి (65) కరోనాతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడికి అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబీకులు సొంత గ్రామానికి తీసుకెళ్లారు. అయితే, అక్కడి గ్రామస్థులు అంత్యక్రియలకు అభ్యంతరం తెలిపారు. దీంతో వారు మరొక గ్రామానికి వెళ్లారు. అక్కడ కూడా గ్రామస్థులు మృతదేహ అంత్యక్రియలకు నిరాకరించారు. దీంతో మృతుడి కుటుంబీకులు ఇలా 24 గంటల పాటు ఒక ఊరి నుంచి మరొక ఊరికి తిరిగారు. ప్రతి చోటా ఇదే తీరులో స్పందన రావడంతో ఏం చేయాలో వారికి పాలు పోలేదు. చివరకు బిషున్పూర్లోని బ్లాక్ ఆఫీస్ బయట ట్రాక్టర్లో మృతదేహాన్ని ఉంచారు. ఈ విషయంలో అధికారులు వెంటనే కలుగజేసుకోవాలని మృతుడి కుటుంబీకులు డిమాండ్ చేశారు.