Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాస్తవాలను గ్రహించకుంటే గుణపాఠాలను నేర్చుకోలేం
- పార్టీని చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది
- సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా
న్యూఢిల్లీ : ఇటీవల ముగిసిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరాభవానికి గల కారణాలను గుర్తించి వెంటనే 'ఇంటిని చక్కబెట్టాల్సిన అవసరం ఉంది' అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలు జరిగిన అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను ఆయా రాష్ట్రాల్లోని సీనియర్ నాయకులు పార్టీకి వివరించాలని సోనియా ఆదేశించారు. కేరళ, అసోంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై పైచేయి సాధించకపోవడాన్ని, పశ్చిమ బెంగాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోవడాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వాస్తవాలను గ్రహించలేకుంటే సరైన గుణపాఠాలను నేర్చుకోలేమని చెప్పారు. ఈ దిశగా తాను అందరి సూచనలు, సలహాలు కోరుతున్నానన్నారు. మన లోపాలేంటో గుర్తించాల్సిన అవసరం ఉందనీ, ఎన్నికల్లో అంచనాలను ఎందుకు అందుకోలేకపోయామో వివరించాలన్నారు. పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులను వాస్తవిక కోణంలో గుర్తించేందుకు ఓ చిన్న స్థాయి కమిటీని నియమించాలనుకుంటున్నట్టు సోనియా తెలిపారు.
కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్రంతో కలిసి పని చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని సోనియా గాంధీ అన్నారు. 18-45 ఏండ్ల వారికి వ్యాక్సిన్ కోసం అయ్యే వందల మిలియన్ల మొత్తాన్ని రాష్ట్రాలు భరించాలంటూ మోడీ సర్కార్ తెగేసి చెబుతుండటాన్ని ఆమె తప్పుపట్టారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై చర్చ
పార్టీ అంతర్గత ఎన్నికల అంశాన్నీ సోనియా ఈ సందర్భంగా లేవనెత్తారు. నూతన అధ్యక్షుడికి సంబంధించిన అంతర్గత ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక అంశాన్ని కూడా సోనియా గాంధీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. జనవరి 22న సీడబ్ల్యూసీ సమావేశమైనప్పుడు జూన్ నెలాఖరుల కల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి చేయాలని నిర్ణయించినట్టు గుర్తు చేశారు. ఎన్నికల అథారిటీ చైర్పర్సన్ మధుసూదన్ మిస్త్రీ ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సిద్ధం చేశారని అన్నారు. అయితే దేశంలో కరోనా పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ప్రస్తుతానికి వాయిదా పడినట్టు సమాచారం.
దేశానికి ఆక్సిజన్ కావాలి...
ప్రధాని నివాసం కాదు : రాహుల్ గాంధీ
కరోనా వైరస్ సెకండ్ వేవ్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోన్న వేళ.. కేవలం నగరాలే కాదు, గ్రామాలు కూడా దేవుడి మీదే ఆధారపడి ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రస్తుం దేశానికి ఊపిరి కావాలనీ, ప్రధానమంత్రి నివాసం కాదని ఎద్దేవా చేశారు. ఓ వైపు ఆక్సిజన్ కొరతతో రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సెంట్రల్ విస్టా పనులను కొనసాగించడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీరుపై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.