Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక వృద్ధిపై ప్రభావం : ఫిచ్ రేటింగ్స్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉన్నది. కరోనా ఉధృతి నేపథ్యంలో యాక్టివ్ కేసులు భారీగా పెరగడం, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత దేశంలో అనేక మంది ప్రాణాలు గాల్లో కలవడానికి కారణమవుతున్నది. ఇదిలా ఉండగా, టీకాల కొరత సైతం వేధిస్తుండటం దేశంలో కరోనా పరిస్థితులను మరింత దారుణంగా మారుస్తున్నదని అంతర్జాతీయ సంస్థ ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడం కారణంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత మరింత పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కేసులు తగ్గినా భవిష్యత్తులో దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. టీకాలు వేయడంలో ఇప్పటివరకు రికార్డు సృష్టించామని చెప్పకుంటున్న భారత్లో మే 5 నాటికి దేశంలోని 9.4శాతం జనాభాకు మాత్రమే కనీసం ఒక డోసు కరోనా టీకా అందిందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అయితే, ప్రస్తుత కరోనా విజృంభణ ప్రభావం ఆర్థిక కార్యకలాపాలపై 2020 ఏడాది కంటే తక్కువగానే ఉండే అవకాశముందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఏదేమైనప్పటికీ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఆర్థిక పునరుద్ధరణ మరింత నెమ్మదిస్తుందని పేర్కొంది. ఈ ప్రభావం తాము అంచనా వేసినదానిక కంటే అధిక కాలంపాటు ఉండే అవకాశంల లేకపోలేదని వెల్లడించింది. కాగా, ఇటీవల ఆర్బీఐ ప్రకటించిన చర్యలు రాబోయే 12-24 నెలల్లో ఎఫ్ఐఐలకు కొంత ఉపశమనం కలిగిస్తాయని తెలిపింది. కాగా, ఫిచ్ 2021-22లో భారత జీడీపీ వృద్ధిని 12.8 శాతంగా అంచనా వేసింది. ఇది 2022-23లో 5.8 శాతం వరకు ఉండొచ్చని తెలిపింది. అయితే, కరోనా ప్రభావం, పెరుగుతున్న మరణాలు ఈ వృద్ధిపై ప్రభావం చూపుతాయని ఫిచ్ రేటింగ్స్ హెచ్చరించింది.