Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది మృతి
- ప్రాణాపాయ స్థితిలో మరికొందరు
తిరుపతి : తిరుపతి రుయా ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఘోరం జరిగింది. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో 11 మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దాదాపు 25 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో ఐసియులో 100కుపైగా రోగులున్నారు. దీంతో ఆస్పత్రిలో భయానక వాతావరణం నెలకొంది. తమకు ఊపిరి అందడం లేదంటూ రోగులు ఆర్తనాదాలు పెట్టారు. మరోవైపు బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితి క్లిప్టంగా మారిన వారికి అత్యవసర శ్వాస అందించేందుకు సిపిఆర్ నిర్వహించారు. అయినా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సంఘటన తెలియగానే జిల్లా కలెక్టర్ హుటాహుటిన ఆస్పత్రి వద్దకు వచ్చారు. తమిళనాడు నుండి రావాల్సిన ఆక్సిజన్ సకాలంలో అందకపోవ డంతో ఈ పరిస్థితి ఏర్పడింది.ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి వివరాలు పంపాలని ఆదేశించారు.
తీవ్ర ఉద్రిక్తత
రుయా ఆస్పత్రి వద్ద తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోగుల బంధువులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఆస్పత్రిపైన, కనిపించిన వైద్య సిబ్బంది మీద దాడులకు దిగారు. మరోవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడటానికి వైద్యులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయానికి కానీ రోగుల పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ హరినారాయణ మిగిలిన వారి ప్రాణాలను కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. సంఘటన జరిగిన సమయంలో ఐసియు, ఎమర్జెన్సీ వార్డులు దాదాపుగా 140 మంది ఉన్నట్టు సమాచారం. ఒక్కసారిగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో వీరి పరిస్థితి ఆందోళన కరంగా మారింది.