Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా రెండో వేవ్‌కు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
- రోడ్డునపడ్డ కోట్లాది మంది వేతన జీవులు
ప్రస్తుతం దేశంలో కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. కరోనా వైరస్ విజృంభణతో దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. దాంతో వేతన జీవుల బతుకులు మళ్లీ ఆగమయ్యాయి. ప్రయివేటురంగంలో కార్మికులు, ఉద్యోగుల ఉపాధి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనపడుతోంది. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్‌లోనే 34లక్షలమంది వేతన ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. ఈ ఏడాది రెండో వేవ్ వల్ల (ఏప్రిల్ నాటికి) దాదాపు 75లక్షల ఉద్యోగాలు పోయాయి. - సీఎంఐఈ ఏప్రిల్ నివేదిక
న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభం, కరోనా వైరస్..కారణాలేమైనా దేశంలో సగటు వేతనజీవి బతుకు ఆగమైంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కోట్లాదిమంది ఉపాధికి దూరమై గిలగిలా కొట్టుకుంటున్నారు. కరోనా రెండో వేవ్ దెబ్బకు ఒక్క ఏప్రిల్ నెలలో 34లక్షల మంది వేతన ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారని 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక (మే 10న విడుదలైంది) వెల్లడించింది. దీని ప్రకారం..జాతీయ నిరుద్యోగరేటు 7.97శాతానికి పెరిగింది. నిరుద్యోగం నాలుగు నెలల గరిష్టస్థాయికి చేరుకుంది. ఏప్రిల్ నెల గణాంకాల ఆధారంగా ఆర్థికవేత్తలు వ్యక్తం చేసిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొత్తంగా వేతన ఉద్యోగుల సంఖ్య 4.6 కోట్ల నుంచి 4.544కోట్లకు తగ్గింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రెండో వేవ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో ఈ ఏడాదిలో ఏప్రిల్ నాటికి మొత్తంగా 75లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. గతేడాది దేశవ్యాప్త లాక్డౌన్, కరోనా మొదటివేవ్ నేపథ్యంలో (2020) ఏప్రిల్‌లో కోటీ 70లక్షల మంది వేతన ఉద్యోగులు రోడ్డునపడ్డారు. అదే ఏడాది ఆగస్టునాటికి ఉపాధికోల్పోయినవారి సంఖ్య 2.1కోట్లకు చేరుకుంది. 2020 ఏప్రిల్, మే నెలల్లో మొత్తంగా సంఘటిత, అసంఘటితరంగంలో 12.1కోట్లమంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధికోల్పోయారు.
ఆర్థిక తోడ్పాటు అందించాలి : కార్మిక సంఘాలు
చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ మూతపడటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో 28.4లక్షల మంది, 5.6లక్షలమంది నగరాల్లో ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునేంత వరకు ఉపాధి పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేదని ఆర్థికవేత్త సంతోష్ మల్హోత్రా అన్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడటానికి ఆదాయ పన్ను చెల్లింపు పరిధిలోకి రాని కుటుంబాలకు నెలకు రూ.7500 ఆరు నెలలపాటు ఆర్థికసాయం, రేషన్ సరుకులు అందజేయాలని కార్మిక సంఘాలు ప్రధాని మోడీని ఇటీవల మళ్లీ కోరాయి. ప్రభుత్వరంగంలో మౌలిక వసతుల కల్పనపై పెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేయటం ద్వారా కోట్లాది మందికి ఉపాధి లభిస్తుందని ఆర్థికవేత్తలు ఎప్పట్నుంచో సూచిస్తున్నారు.
దినసరి కూలీలుగా మారారు : అజీం ప్రేమ్‌జీ వర్సిటీ నివేదిక
దేశంలో ఉద్యోగ, ఉపాధి పరిస్థితిపై 2021 ఏడాదికి సంబంధించి అజీం ప్రేమ్‌జీ వర్సిటీ విడుదల చేసిన నివేదికలోనూ పై విషయాలు వ్యక్తమయ్యాయి. ''లాక్డౌన్ తర్వాత (2019-20తర్వాతకాలంలో) ఉపాధి కోల్పోయిన కార్మికులంతా కూడా దినసరి కూలీలుగా మారారు. ఉద్యోగ భద్రతలేని ఉద్యోగాల్లో చేరారు. సంఘటితరంగంలో ఉద్యోగ భద్రత ఉన్నవారు ఉపాధి కోల్పోయాక.. అసంఘటిత రంగంలోకి మారారు. ఇందులో 30శాతం స్వయం ఉపాధి వైపు వెళ్లగా, 10శాతం మంది దినసరికూలీలుగా మారార''ని నివేదిక పేర్కొన్నది. జాతీయ సగటు వేతనం (అనూప్ సత్పతీ కమటీ సిఫారసు) రూ.375కన్నా తక్కువగా పొందేవారి సంఖ్య 23కోట్లకు చేరుకుంది.