Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురలో బీజేపీ బరితెగింపు
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఖండన
- త్రిపురలో జంగిల్ రాజ్ : మాజీ సీఎం మాణిక్ సర్కార్
అగర్తలా : త్రిపురలో బీజేపీ అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. సోమవారం నాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్, డిప్యూటీ లీడర్ బాదల్ చౌదరి, ఇతర పార్టీ నాయకులపైన బీజేపీ శ్రేణులు భౌతిక దాడులకు తెగబడ్డాయి. గత వారం బీజేపీ అరాచక దాడిలో ధ్వంసమైన సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల ఇండ్లను సందర్శించి, బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాణిక్ సర్కార్ బృందంపై దక్షిణ త్రిపురలోని శాంతిర్‌బజార్ వద్ద ఈ దాడి జరిగింది. ఈ దాడిని సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడిలో పాల్గొన్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ప్రజావ్యతిరేక హింస, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం విశ్వసనీయతను, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందనీ, ఇలాంటి దాడుల ద్వారా ప్రతిపక్షాలను అడ్డుకోవాలనుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపురలో జంగిల్ రాజ్ నడుస్తున్నదనీ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, శాంతిని పునరుద్ధరించడం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తాను సిద్ధమేనని ప్రతిపక్ష నేత మాణిక్ సర్కార్ ట్వీట్ చేశారు. త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే, అసమ్మతివాది సుదీప్రారు బర్మన్ కూడా ఈ దాడిని ఖండించారు. ప్రతిపక్ష నేతపె దాడితో త్రిపురలో రాజకీయాలు ఇదివరకెన్నడూ లేనంత నీచ స్థితికి దిగజారాయని ఆయన వ్యాఖ్యానించారు.
పొలిట్‌బ్యూరో ఖండన
మాణిక్ సర్కార్ బందంపై బీజేపీ గూండాల దాడిని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ఈ కార్యక్రమానికి త్రిపుర పోలీసులు, అధికారుల అనుమతి ఉంది. ఇటీవల దాడుల్లో గాయపడిన, ఆస్తులు ధ్వంసమైన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న మాణిక్ సర్కార్, ఇతర ప్రతిపక్ష బృందాన్ని అడ్డుకుని, వారిపై బీజేపీ అరాచకశక్తులు భౌతిక దాడులకు దిగారని పొలిట్‌బ్యూరో పేర్కొంది.త్రిపురలో ప్రజాస్వామ్యయుత కార్యకమాన్ని అడ్డుకోవడం ద్వారా బీజేపీ తన అసలు స్వరూపాన్ని, రంగును బయటపెట్టుకుందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఇటువంటి చర్యలు ఎంతమాత్రం అనుమతించరానివి. వీటిని ప్రతిఘటించడమేకాదు, ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని పొలిట్‌బ్యూరో హెచ్చరించింది.