Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వలసల నిలుపుదలకు
ఉపాధి కల్పించాలి
ొ మోడీ చేతకానితనమే
ఈ దుస్థితికి కారణం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-నర్సంపేట
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అడిగిన ప్రతి ఒక్కరికీ నిర్థారణా పరీక్షలు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ రూరల్ జిల్లా నర్పంపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి అరికట్టడానికి గ్రామం, బస్తీ, పని ప్రదేశాల్లో మొబైల్ పరీక్షలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రిలో రోగుల సంఖ్యకనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయనీ, అనేక మందికి వైద్యం అందక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం అందించడానికి ఆక్సిజన్ బెడ్లు పెంచాలనీ, అవసరానికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలన్నారు. మోడీ చేతకానితనం వల్లే దేశంలో నేడు ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. కరోనా మహమ్మారి నుంచి రక్షణ కలిపించడానికి పీఎం కేర్ నిధులను రాష్ట్రాలకు తక్షణం కేటాయించాలనీ, దేశంలోని అన్ని ప్రయివేటు ఆస్పత్రులను కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేసి ఉచితంగా కరోనా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలనీ, గ్రామాల్లోనూ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలను వేయాలని సూచించారు. రైతు వేదికలు, ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి కరోనా బాధితులకు వైద్య, వసతి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మొదటి వేవ్ కాలంలో జరిగినట్టుగానే సెకండ్ వేవ్‌లో కూడా కార్మికులు ఉపాధి కోల్పోయి పట్టణాల నుంచి స్వస్థలాలకు తిరుగుముఖం పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పేదలందరికీ నెలకు రూ.7500 నగదుతో పాటు ఒక్కొక్కరికీ 10 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వలసలు ఆపడం కోసం పట్టణాల్లోనూ ఉపాధి హామీ పనులు చేపట్టి రోజు కూలీ రూ.600 ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు భూక్య సమ్మయ్య, కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్, నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, సింగారపు బాబు, మొగులోజు శారద తదితరులు పాల్గొన్నారు.