Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూచన
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి కేంద్రం ఫార్ములా తీసుకొని, ఇతర ఫార్మా కంపెనీలకు ఇవ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూచించారు. వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు ఇదొక్కటే మార్గమన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా కంపెనీలకు వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం రెండు కంపెనీలు నెలకు కేవలం 6, 7 కోట్ల డోసులు మాత్రమే తయారు చేస్తున్నాయని వివరించారు. ఈ పరిస్థితి ఉంటే దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి రెండేండ్లకు పైగా సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి లోపు ఎన్నో కొత్త వేరియంట్ లు, వేవ్ లు వచ్చి దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తాయన్నారు. అందువల్ల దేశంలో వ్యాక్సిన్ తయారీని యుద్ద ప్రతిపాదన వేగవంతం చేయాలన్నారు. రానున్న కొద్ది రోజుల్లో అందరికీ వ్యాక్సిన్ వేసేలా నేషనల్ ప్లాన్(రాష్ట్రీయ యోజన) తీసుకురావాలని కోరారు. ఎప్పటి వరకు ప్రజలకు వ్యాక్సిన్ అందదో, అప్పటి వరకు కరోనాపై యుద్దంలో గెలవలేమని తేల్చి చెప్పారు. ఈ విధానాన్ని అవలంభిస్తేనే సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగించవచ్చని వివరించారు.