Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లలో భారీగా ప్రాణవాయువు సరఫరా : రైల్వే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రభాదం ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా కారణంగా భారతీయ రైల్వేలోని 1,952 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలు గతేడాది మార్చి నుంచి నేటి వరకు చోటుచేసుకున్నాయని రైల్వే బోర్డు చైర్మెన్ అండ్ సీఈవో సునీత్ శర్మ తెలిపారు. అలాగే, రోజుకూ సగటున 1000 మందికి కరోనా సోకుతున్నదని వెల్లడించారు. దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఇండియన్ రైల్వేలో కరోనా ప్రభావం అధికంగానే ఉందన్నారు. కరోనా సంక్షోభం, గతేడాది లాక్డౌన్ సమయంలోనూ తమ సేవలు కొనసాగించామనీ, ప్రజలకు అవసరమైన వస్తువులతో పాటు వారిని కూడా గమ్య స్థానాలకు చేర్చడానికి తాము ముందుకు సాగుతున్నామన్నారు. ''ఇది డైనమిక్ ఫిగర్. కొన్ని రోజుల్లో 1300 కేసులు, మరికొన్ని రోజుల్లో 750 కేసులు వచ్చి కాస్త మెరుగైనట్టుగా అనిపించిన రోజులున్నాయి. వీరందరూ కూడా రైల్వే ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. పడకలను పెంచాం. ఆస్పత్రుల్లో కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్లను సైతం నిర్మించాం'' అని శర్మ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం ఎంతమంది రైల్వే ఉద్యోగులు కరోనా బారినపడ్డారనే విషయన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే, ఏప్రిల్‌లో 93 వేల మంది కరోనా బారినపడ్డారని తెలిపారు.