Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ, ఐద్వా, సీపీఐ(ఎం) నివాళి
న్యూఢిల్లీ : కార్మిక నేత, సీఐటీయూ వర్కింగ్ కమిటి సభ్యురాలు రంజనా నిరులా (75) కన్నుమూశారు. కరోనా సోకిన ఆమెను ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చేర్చగా.. కొన్నిరోజులుగా అక్కడ చికిత్స పొదుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కార్మిక ఉద్యమంలో 50 ఏండ్లకు పైగా రంజనా నిరులా వివిధ బాధ్యలను చేపట్టారు. సీపీఐ(ఎం) కార్యకర్తగా ఢిల్లీలో జరిగిన అనేక ఉద్య మాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా
ఆశా కార్మికుల ఉద్యమాన్ని నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించారు. రంజనా స్నేహశీలి, మృదుభాషిణి, కార్యకర్తలను చాలా ఆప్యాయంగా పలకరించేవారు. సీఐటీయూ మాజీ కోశాధికారిగా, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్‌గా వివిధ బాధ్యతలను ఆమె సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం సీఐటీయూ వర్కింగ్ కమిటీ సభ్యులుగా, ఆశావర్కర్స్ యూనియన్ ఆలిండియా కన్వీనర్‌గా, వాయిస్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ వర్కింగ్ ఎడిటర్‌గా 86 సంవత్సరాల వయస్సులో కూడా ఆమె సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వర్తించారు. చాలామంది ఉద్యమకార్యకర్తలకు రంజనా నిరులా ఆదర్శంగా నిలిచారు. రంజనా 1998 నుంచి ఇప్పటి వరకు 'ది వాయిస్ ఆఫ్ ది వర్కింగ్ ఉమెన్' వర్కింగ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పత్రిక మొట్టమొదటగా 1980లో విమల రణదివె వ్యవస్థాపక సంపాదకత్వంలో ప్రచురించబడింది. ఆమె ఢిల్లీలోని ఐద్వా వ్యవస్థాపక నాయకుల్లో ఒకరు. చాలా ఏండ్లు ఐద్వా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలను నిర్వర్తించారు. ఆమె కీలకమైన ప్రారంభ సంవత్సరాల్లో ఐద్వా ఏర్పాటుకు, అభివృద్ధి చెందడానికి ఆమె విలువైన సహకారాన్ని అందించారు. ఉద్యమంలో చాలా మంది కార్యకర్తలకు రంజనా మార్గనిర్దేశం చేశారు. రంజనా మరణం పట్ల సీఐటీయూ, ఐద్వా, సీపీఐ(ఎం) సంతాపం తెలిపాయి. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించాయి. ఆమె మరణం దేశ కార్మికోద్యమానికి తీరని లోటని పేర్కొన్నాయి. విప్లవ జోహార్లు అర్పించాయి. సీఐటీయూ జాతీయ అధ్యక్షులు హేమలత, ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్, సీపీఐ(ఎం) నేతలు నివాళులర్పించారు.
రంజనా నిరులా మృతికి సీఐటీయూ సంతాపం
కోవిడ్-19తో చనిపోయిన సీఐటీయూ వర్కింగ్ కమిటీ సభ్యురాలు, ఆశా వర్కర్ల ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ రంజనా నిరులా మృతికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం.సాయిబాబు మంగళవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.