Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సీఎం, ఏచూరి సహ పలువురి నివాళి
తిరువనంతపురం: కేరళ తొలి రెవెన్యూ మంత్రి, కమ్యూనిస్టు నేత కెఆర్ గౌరీ అమ్మ (102) మంగళవారం ఉదయం కన్నుమూశారు. వయో సంబంధింత సమస్యలతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అలప్పుజ జిల్లాలోని చెర్తాలాలో ఆమె జన్మించారు. కేరళ తొలి ముఖ్యమంత్రి ఇఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలోని తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా వ్యవహరించారు. కార్మిక, కర్షక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. పలుదఫాలు జైలుకు కూడా వెళ్లారు. 1952లో ట్రావెన్కోర్ కౌన్సిల్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1954లో మరోసారి భారీ మెజారిటీతో గెలు పొందారు. 1957, 1967, 1980, 1987 సంవత్సరాల్లో కేరళలో వామపక్ష నేతృత్వంలోని
ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. 1957లో భూసంస్కరణ బిల్లును ప్రవేశపెట్టారు. 1987లో మహిళా కమిషన్ బిల్లు రూపకల్పనలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కేరళ రాజకీయల్లో ఎక్కువ కాలం కొనసాగిన అమ్మ... యుక్త వయస్సులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
పలువురి నివాళి
గౌరీ అమ్మ మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ మంత్రులు సంతాపం తెలిపారు. ఆమె ఓ పోరాట యోధురాలనీ, దోపిడీని అంతం చేసేందుకు, సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేశా రని పినరయి ట్వీట్ చేశారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో, నిర్వాహకురాలిగా ఆమె కృషి ఎనలేనిదని అన్నారు. మరింత ప్రగతిశీల సమాజాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేయటం, ఆమె ఆశయాల సాధనకు కృషి చేయటమే అమ్మకు మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొ న్నారు. అమ్మ మరణ వార్త కలచి వేసిందనీ, కేరళ ప్రజా ఉద్యమాల్లో ఆమె పాత్ర అమూల్యమైనదని సీతారాం ఏచూరి తెలిపారు.