Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసారి కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది : ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రీజ్
న్యూఢిల్లీ: తీవ్రమైన ఉపాధి సంక్షోభం దిశగా భారత్ వెళ్తోందని ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రీజ్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ సంక్షోభం, స్థానిక లాకడౌన్ల కారణంగా దేశంలో కార్మికశక్తి పరిస్థితి దారుణంగా తయారైందని ఆయన అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నా రంటే, గత ఏడాదిలాగే ఈసారి కూడా కరోనా సంక్షోభం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపో యారని, ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయని ఆయన చెప్పారు. కరోనా వ్యాప్తి చెందుతోందనే భయం విపరీతంగా ప్రచారం అయ్యిందని, దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటం కష్టమేనని అన్నారు. కరోనా రెండో వేవ్ వస్తుందనే విషయాన్ని భారత ప్రభు త్వం నిరాకరించటం వల్లే పెను విపత్తుకుదారి తీసిందని అన్నారు. వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని కొన్ని నెలల కిందటే నిపుణులు గుర్తించారు. ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కేంద్రం అంగీకరించలేదని, ఈ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని ఆయన అన్నారు.
అదోక పనికిమాలిన లక్ష్యం
2024-25 కల్లా భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 5 ట్రిలియన్ డాలర్ల(సుమారుగా రూ.360లక్షల కోట్లు)కు తీసుకెళ్లటమే తమ లక్ష్యమని మోడీ సర్కార్ ఘనంగా ప్రకటించింది. ఇదొక పనికిమాలిన టార్గెట్. అంతేకాదు ఎవ్వరికీ ఉపయోగపడనిది కూడా. దేశంలో శక్తిమంతులైన ధనికులు, కార్పొరేట్ల కల అది. సగటు జీడీపీ లెక్కలు సైతం దేశ సంపద, ఆర్థిక శక్తిపై భ్రమలు కల్పిస్తాయి. ఎందుకంటే దేశంలో అత్యధికమంది పేదలున్నారు. ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచడం కోసం జీడీపీ గణాంకాల్ని ఉపయోగిస్తారా? అలా చేయకుండా రక్షణశాఖలో ఖర్చు పెంచుకోవడానికి వారికి జీడీపీ గణాంకాలు ఉపయోగపడతాయి.
అప్పులు కూడా దొరకటం లేదు
గత ఏడాదితో పోల్చితే చాలామంది ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. పొదుపు చేసుకున్న మొత్తాలు ఖర్చు చేసేశారు. మరికొంత మంది రుణాలు చేసి..నెట్టుకొచ్చారు. ఈసారి అప్పులు కూడా దొరకటం లేదు. ఆర్థిక సంక్షోభంతో దెబ్బతిన్నవారికి ఆర్థిక ప్యాకేజీ అందించాలనే ఆలోచన కేంద్రం చేయటం లేదు. జాతీయ స్థాయి లాక్డౌన్తో సంబంధం లేకుండానే రాష్ట్రాలే ప్రకటిస్తున్నాయి. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా తీవ్రమైన ఉపాధి సమస్యకు దారితీస్తుంది.