Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీకాకు దూరంగా 80 శాతం మంది
- ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ నిబంధనతో ఇబ్బందులు
- నిరక్షరాస్యత, సౌకర్యాలలేమితో అవస్థలు
- ధారావి నుంచి బసంతి వరకు ఇవే అగచాట్లు
- 'నవతెలంగాణ' క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి
- మురికివాడల్లో కానరాని వ్యాక్సినేషన్
'అయ్యా.. సూది మందు (వ్యాక్సిన్) తీసుకున్నావా? అని అందరూ అడుగుతున్నారు. అది వేసుకోవాలంటే కంప్యూటర్ లో (కొవిన్ పోర్టల్) పేరు రాయాలంట. ఇంకేదో తేదీ చూసుకోవాలంట. నాకు చదువు రాదు. ఆ పేరు ఎక్కించే పద్దతి ఇక్కడ ఎవరికీ తెలియదు. టీకా కోసం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలాడ్ ఆరోగ్య కేంద్రానికి రెండుసార్లు వెళ్లాను. పేరు లేనిది టీకా వెయ్యమన్నారు. కూలీ పని చేసుకునే నేను.. పని వదిలిపెట్టుకొని రోజూ తిరుగలేను కదా'-ముంబయిలోని ధారావి మురికి వాడలోని యాభై ఏండ్ల అబ్జల్ (పేరు మార్చాము) చెప్పిన మాటలివి..
కరోనా ఉధృతితో దేశం అల్లకల్లోలమవుతున్నది. మహమ్మారి కట్టడికి వేగవంతమైన వ్యాక్సినేషనే సులువైన మార్గమని నిపుణులు చెబుతున్నా.. పాలకుల అసమర్థ వైఖరి, టీకాల కొరతతో వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతున్నది. 'కొవిన్' పోర్టల్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వం చెప్పడంతో నిరక్షరాస్యులు, పేదలు, వృద్దులతో పాటు కనీస సౌకర్యాలు లేకుండా మురికి వాడల్లో నివసిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైరస్ వ్యాప్తికి 'స్లమ్' ఏరియాలు కూడా దోహదం చేయవచ్చనీ, ముందుగా అక్కడి ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేయడం ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన మురికివాడల్లో 'నవతెలంగాణ' క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వే నిర్వహించింది.
పేరు: భల్స్వా (ఢిల్లీ)
జనాభా: సుమారు 22 వేలు 18 ఏండ్లు దాటినవారు: సుమారు 19 వేలు టీకా వేసుకోని వారు: సుమారు 15 వేలు
ఏరియా ప్రజలు చెప్పిన మాట: టీకా కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పద్దతి తీసెయ్యాలి. కేంద్రాలకు వచ్చిన వారికి ముందుగా వ్యాక్సిన్ వేయించాలి.
పేరు: ధారావి (ముంబయి)
జనాభా: 10 లక్షలకు పైగా
18 ఏండ్లు దాటినవారు: సుమారు 7.8 లక్షలు
టీకా వేసుకోని వారు: సుమారు 6 లక్షలు
ఏరియా ప్రజలు చెప్పిన మాట: ఓట్ల కోసం ఇంటిం టికి వచ్చిన నాయకులు.. వ్యాక్సిన్ వేయించడానికి ఎందుకు రావట్లేదు?
పేరు: బసంతి (కోల్కతా)
జనాభా: సుమారు 7వేలు
18 ఏండ్లు దాటినవారు: సుమారు 5 వేలు టీకా వేసుకోని వారు:
సుమారు 4.5 వేలు
ఏరియా ప్రజలు చెప్పిన మాట: పోలియో చుక్కల తరహాలో ఇంటింటికి వచ్చి టీకా వేయాలి. అప్పుడు టీకా కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడరు. వైరస్ వ్యాప్తి భయాలు ఉండవు.
పేరు: నోచికుప్పం (చెన్నై)
జనాభా: సుమారు పాతిక వేలు 18 ఏండ్లు దాటినవారు: సుమారు 17 వేలు టీకా వేసుకోని వారు: సుమారు 15 వేలు ఏరియా ప్రజలు చెప్పిన మాట: టీకా రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక వలంటీర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.