Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13.7 నుంచి 9.3శాతానికి తగ్గింపు
న్యూఢిల్లీ : ప్రముఖ రేటింగ్ సంస్థ 'మూడీస్' ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి భారత జీడీపీ గణాంకాల్ని సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 13.7శాతం వృద్ధి ఉండొచ్చని గతంలో తెలుపగా, దానిని సవరించి 9.3శాతానికి తగ్గించి అంచనాలు విడుదలచేసింది. ఆర్థిక వృద్ధి చాలా బలహీనంగా ఉందని, క్రమంగా రుణభారం పెరుగుతోందని, కరోనా రెండోవేవ్తో ఆర్థికవృద్ధికి అనేక అడ్డంకులున్నాయని 'మూడీస్' అభిప్రాయపడింది. '' కరోనా రెండో వేవ్ ప్రభావం చూపుతున్నవేళ జీడీపీ గణాంకాల్ని సవరించా''మని మూడీస్ బుధవారం ఒక ప్రకటన జారీచేసింది. ద్రవ్యలోటు(జీడీపీలో) 10.8శాతం నుంచి 11.8శాతానికి పెరిగిందని, ఆర్థికమాంద్యం, ద్రవ్యలోటు విస్తరించడం..వంటివి ప్రభుత్వరుణ భారాన్ని మరింత పెంచిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో ప్రభుత్వ రుణభారం 90శాతానికి చేరుకుంటుందని మూడీస్ అంచనావేసింది. ఇది 2023లో 92శాతానికి ఎగబాకుతుందని తెలిపింది. భారత్కు సంబంధించి తమ గణాంకాలు, అంచనాలు సమీప భవిష్యత్తులో మారే అవకాశం లేదని కూడా మూడీస్ పేర్కొంది. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి, విధానపరమైన చర్యలు మాత్రమే వృద్ధిపై నమ్మకాన్ని పెంచుతాయని నివేదికలో పేర్కొన్నారు. భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రముఖ రేటింగ్ సంస్థలు భారత వృద్ధిరేటు అంచనాల్లో కోత విధిస్తున్నాయి.