Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థారణ అయినట్టు అత్యున్నత న్యాయస్థానం పరిపాలక విభాగం బుధవారం వెల్లడించింది. కోవిడ్-19 రెండో ప్రభంజనాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, సంసిద్ధతకు సంబంధించి స్వీయ విచారణ జరుపుతున్న ధర్మాసనానికి ఆయన నేతృత్వంవహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ గురువారం జరగాల్సి ఉన్నది.ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఉన్నారు.
జస్టిస్ చంద్రచూడ్ అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో ఈ స్వీయ విచారణ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులు ఈ విచారణను చేపడతారా..?, లేదా అనేది ఇంకా స్పష్టతరాలేదు. మరొక సీనియర్ జడ్జి ధర్మాసనానికి ఈ విచారణను అప్పగించే అధికారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఉన్నది.
రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను కట్టుదిట్టంగా సరఫరా చేయడం కోసం శాస్త్రీయ అధ్యయనం, సిఫారసులు చేయాలని ఆదేశిస్తూ ఓ నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.