Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈసారి వైరస్ ప్రభావం గ్రామాలపైనే అధికం : రాజకీయ విశ్లేషకులు
పంటలసాగు,
ఆహార ఉత్పత్తిపై దెబ్బ !
- దీనివల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరగవచ్చు..
- ఉపాధి హామీ పనులు మొదలైతే.. కొంత ఊరటకరోనా కేసులు గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా నమోదవుతున్నాయి. మార్చిలో 36.8శాతముంటే, మే నెలో (కొత్త కేసుల నమోదు) 48.5శాతానికి పెరిగింది. ఏప్రిల్లో జీఎస్టీ ఈ-వే బిల్లులు, వాహన అమ్మకాలు, ఎరువుల అమ్మకాలు పడిపోయాయి. ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా..పరిస్థితులు మారినా..గ్రామీణ కొనుగోళ్లు పుంజుకుంటాయా? అంటే చెప్పలేం...అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎకానమీ రీసెర్చ్ విభాగం తన నివేదికలో పేర్కొన్నది.
న్యూఢిల్లీ : కరోనా మొదటివేవ్కు..రెండోవేవ్కు చాలా తేడా ఉంది. గత ఏడాది వైరస్ భయాలు, లాక్డౌన్ ప్రభావం ప్రధానంగా నగరాలపై పడింది. అయితే ఈ రెండోవేవ్...నగరాలు, గ్రామాలు అనే తేడా చూపలేదు. మొత్తం దేశాన్ని వణికిస్తోంది. అయ్యో..మాకు దిక్కెవరు? అని ప్రజలంతా హడలిపోతున్నారు. ఈసారి సంక్షోభ ప్రభావం గ్రామీణ ప్రాంతంపై అధికంగా ఉందని ఆర్థిక, రాజకీయ విశ్లేషకలు చెబుతున్నారు. రెండో వేవ్ ఇప్పట్లో పోయేలా కనపడటం లేదు. కాబట్టి గ్రామీణ సేవలు పుంజుకునే పరిస్థితి కనపడటం లేదని వారు చెప్పారు. గత ఏడాదికన్నా కఠినమైన లాక్డౌన్ అనేక రాష్ట్రాల్లో అమలవుతోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఇది తప్పకుండా ప్రభావం చూపుతుందని వారు అంచనావేశారు.
ఉపాధి హామీ ఉంటుందా?
పంట చేతికొచ్చింది..అమ్ముకుందామనేసరికి పరిస్థితులు అనూహ్యంగా మారాయి. పంట ఉత్పత్తుల అమ్మకాలు ఆశించినంతగా లేవు. ఇది ముందు ముందు పంట సాగుపై ప్రభావం చూపుతుంది. తద్వారా మార్కెట్లోకి ఆహార ధాన్యాల సరఫరా తగినంతగా ఉండకపోవచ్చు. ఉపాధి హామీ పనుల వల్ల గత ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వర్గాలకు కొంతమేరకు ఆదాయ మద్దతు లభించింది. అయితే ఈ ఏడాది ఈ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం అమలుజేస్తుందా? లేదా? అన్నది తెలియదు. మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించాలని, తద్వారా కోట్లాది మంది గ్రామీణ ప్రజలకు ఉపాధి లభిస్తుందని పలువురు ఆర్థికవేత్తలు కేంద్రానికి సూచిస్తున్నారు. ఇందుకోసం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఉపయోగించుకోవాలని చెబుతున్నారు.
ఆహార ఉత్పత్తుల కొరత
పట్టణాలు, నగరాల్లో నిత్యావసర వస్తువులకు డిమాండ్ భారీగా పెరిగింది. కారణం గ్రామీణ ప్రాంతాల నుంచి ఆహార ఉత్పత్తులు, ఇతర వస్తువుల సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. గత ఏడాది లాక్డౌన్ వల్ల గ్రామీణ మార్కెట్ల నుంచి సరఫరా చైన్ మాత్రమే తెగిపోయింది. ఈసారి ఉత్పత్తి వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీనివల్ల ఆహార ఉత్పత్తుల కొరత రానున్నదని, ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చునని భారత మాజీ ముఖ్య గణాంకవేత్త ప్రణబ్ సేన్ చెప్పారు. '' ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు పెరిగాయి. ఒకవేళ భారత్ కూడా ఆహార దిగుమతులకు తెరలేపితే..అక్కడ ధరలు మరింత పెరుగుతాయి. వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేసిన దేశాలన్నీ ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్నాయి'' అని సేన్ అన్నారు.
ఆర్థిక అనిశ్చితి
మొదటివేవ్ కన్నా రెండో వేవ్ భారత ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేసిందని సంకేతాలు వెలువడుతున్నాయి. దేశమంతా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. గత ఏడాది దాదాపు రెండున్నర నెలల కఠినమైన లాక్డౌన్ అనంతరం ఆర్థికవ్యవస్థలో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈసారి అలా జరిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. దేశమంతా ఒక భయానక వాతావరణం..ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వారి కొనుగోలు శక్తి కూడా మునపటి మాదిరి లేదు.