Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో కొత్తగా 3,48,421 కేసులు, 4,205 మరణాలు
- ఆందోళనకర స్థాయిలో పాజిటివిటీ రేటు
- కన్నీరు పెట్టిస్తున్న కరోనా దృశ్యాలు
దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. ఆస్పత్రుల్లో పడకలు లేవు. ఆక్సిజన్ లేదు. కరోనా చికిత్స మందులు లేవు. సరిపడినంతగా టీకాలు అందుబాటులో లేవు. దీంతో దేశంలోని అనేక చోట్ల ఆస్పత్రుల ముందే కనీస వైద్యం అందక నిత్యం వందలాది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కండ్లముందే కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతున్నా ఏమి చేయలేని దుస్థితిలో..కన్నీరుమున్నీరవుతున్నారు. ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు నిత్యం అనేకం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కరోనాతో మరణించిన ఓ కుమారుడి అంత్యక్రియలు ఇంకా పూర్తి కాకముందే మరో కుమారుడిని కరోనా బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన గ్రేటర్ నోయిడా సమీపంలోని జలాల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అత్తర్‌సింగ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల వారిద్దరికీ కరోనా సోకింది. ఈ క్రమంలోనే పెద్ద కుమారుడు పంకజ్ మంగళవారం మృతి చెందగా.. ఆయన అంత్యక్రియలు పూర్తి కాకముందే (చితికి నిప్పుపెట్టారు అంతే..) మరో కుమారుడు దీపక్ ఇంట్లో కుప్పకూలిపోయాడు. గంటల వ్యవధిలోనే ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.
44 దేశాల్లో డబుల్ మ్యూటెంట్ !
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. అయితే, దీనికి ప్రధాన కారణం కోవిడ్-19 డబుల్ మ్యూటెంట్ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 'బీ1617' గా పిలుస్తున్న ఈ వేరియంట్‌ను అత్యంత ప్రమాకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం పేర్కొంది. ఈ వేరియంట్‌ను కనీసం 44 దేశాల్లో గుర్తించబడిందని తెలిపింది. ఇది మొదటగా భారత్‌లో గత అక్టోబర్ నెలలో గుర్తించబడిందని వెల్లడించింది. ఈ వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకు పలు దేశాల నివేదికలు అందయనీ, ఇది ఒపెన్ సోర్స్‌లో ఉందని తెలిపింది. ఈ వేరియంట్ అంటీబాడీస్ను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు గుర్తించారు. అత్యంత ప్రమాదకర వేరియంట్లలో బీ1617తో పాటు బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా మ్యూటెంట్లు కూడా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
ఇదిలా ఉండగా, వైరస్లు, వాటి ఉత్పరివర్తనాలు మొదట కనిపించిన దేశాల పేర్లతో గుర్తించడం లేదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. వాటి శాస్త్రీయనామంతోనే పేర్కొంటున్నామని తెలిపింది. వీటికి ఒకే విధమైన పేరు ఉండటం కోసం అందరూ ఇదే పద్ధతిని అనుసరించాలని కోరింది. అలాగే, భారత్‌తో పాటు మరో 44 దేశాల్లో గుర్తించిన బీ1617 మ్యూటెంట్‌ను 'ఇండియన్ స్ట్రెయిన్'గా వర్గీకరించలేదనీ, ఆ పేరును కూడా ప్రస్తావించలేదని తెలిపింది. ప్రస్తుతం మీడియాలో వస్తున్న ఇండియన్ వేరియంట్ కథనాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీ1617ను రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇండియన్ స్ట్రెయిన్ అని ఎక్కడా పేర్కొనలేదనీ, మీడియా సంస్థలే అలా వాడుతున్నాయనీ, ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కేంద్రం వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాడుతూనే ఉంది. మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గక పోవడంతో నిత్యం భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్రం వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. దేశంలోని 13 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఆరు రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష వరకు క్రియాశీల కేసులు ఉండగా.. 17 రాష్ట్రాల్లో 50వేల కన్నా తక్కువ యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్నాకట, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్, బీహార్లు టాప్‌లో ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 5,93,150 యాక్టివ్ కేసులున్నాయి.
కొత్తగా 4,205 మంది మృతి
దేశంలో కరోనా మరణాలు నిత్యం భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,205 మంది మరణించారు. ఇదే సమయంలో కొత్తగా 3,48,421 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 2,33,40,938కి చేరగా, మరణాలు 2,54,197కు పెరిగాయి. ఇప్పటివరకు 1,93,82,642 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 37,04,099 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, దేశంలో 17,52,35,991 మందికి టీకాలు వేశారు. ఇందులో 18 నుంచి 44 ఏండ్లలోపు వారు 30,39,287 మంది మాత్రమే ఉన్నారు. అలాగే, మొత్తం 30,75,83,991 కరోనా పరీక్షలు నిర్వహించారు.
533 జిల్లాల్లో 10 శాతానికి పైగా పాజిటివిటీ
దేశంలో 739కు పైగా జిల్లాలు ఉండగా, వీటిలోని 533 జిల్లాలలో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికిపైగా ఉందని కేంద్రం వెల్లడించింది. జాతీయ పాజిటివిటీ రేటు 21 శాతంగా ఉంది. దేశంలోని 42 జిల్లాల్లో పాజిటివిటీ రేటు జాతీయ పాజిటివిటీ రేటు కంటే అధికంగా ఉంది. అలాగే, దేశంలోని 26 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉంది.
ఆ జైళ్లో 56 మంది ఖైదీలకు కరోనా
దేశంలోని పలు జైళ్లలో కరోనా కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. హర్యానాలోని కర్నాల్ జైళ్లో 56 మంది ఖైదీలకు కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. దీంతో వారికోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నామన్నారు. అలాగే, ఒడిశాలోని మయూర్భంజ్ ఉడల సబ్-జైళ్లో విచారణ ఖైదీలుగా ఉన్న 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.