Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొవటానికి 35 వేల కోట్లు విడుదల చేయండి
- ప్రధాని మోడీకి 12 ప్రతిపక్ష నేతల లేఖ
న్యూఢిల్లీ : కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన ప్రతిపక్షాల నేతలు ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశీయంగా, విదేశాల నుంచి అందుబాటులో వున్న వనరుల ద్వారా కేంద్రం వ్యాక్సిన్లను సేకరించాలనీ, తక్షణమే దేశవ్యాప్తంగా ఉచితంగా, అందరికీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు. దేశంలో కరోనా మహమ్మారితో కనివినీ ఎరుగని రీతిలో మానవ విపత్తు చోటు చేసుకున్నది. ఈ సంక్షోభిత పరిస్థితులను ఎదుర్కొనడానికి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాల్సిన, అమలు చేయాల్సిన చర్యల గురించి విడివిడిగా, కలిసికట్టుగా ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకొచ్చామని సోనియా గాంధీ (కాంగ్రెస్), సీతారాం ఏచూరి(సీపీఐ(ఎం), డి.రాజా (సీపీఐ), హెచ్.డి.దేవగౌడ (జేడీ-ఎస్), శరద్ పవార్ (ఎన్సీపీ), ఉద్ధవ్ థాకరే (శివసేన), ఎం.కె.స్టాలిన్ (డీఎంకే), మమతా బెనర్జీ (తృణమూల్), హేమంత్ సోరెన్ (జెఎంఎం), ఫరూక్ అబ్దుల్లా (జేకేపీఏ),
అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ) ఆ లేఖలో పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఆ సూచనలు వేటినీ ప్రభుత్వం పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. దానివల్లనే పరిస్థితి ఇంతటి విపత్కర పరిణామాలకు దారి తీసిందని తెలిపారు. ఇంతటి విషాదకర పరిస్థితులకు తావిచ్చేలా కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పొప్పుల జోలికి పోకుండా యుద్ధ ప్రాతిపదికపై ఈ కింది చర్యలు చేపట్టాలని వారు సూచించారు. వ్యాక్సిన్లను సేకరించడం, అందరికీ ఉచిత టీకా అందించ డంతో పాటుగా దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని విస్తరించేందుకు తప్పనిసరి లైసెన్సింగ్‌ను ఇవ్వాలి. వ్యాక్సిన్ల కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.35వేల కోట్లను ఖర్చుచేయాలి, సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి. అందుకు బదులుగా ఆ డబ్బుతో ఆక్సిజన్, వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలి. జవాబుదారీతనం లేని ప్రయివేటు ట్రస్టు నిధి, పీఎం కేర్స్‌లో వున్న డబ్బునంతా విడుదల చేసి మరిన్ని వ్యాక్సిన్లు, ఆక్సిజన్, ఇతర అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని వారు ఆ లేఖలో సూచించారు. నిరుద్యోగులందరికీ నెలకు రూ.6 వేలు ఇవ్వాలి, అవసరంలో వున్నవారికి (కేంద్ర గోదాముల్లో ప్రస్తుతం కోటి టన్నులకు పైగా ఆహార ధాన్యాలు ముక్కిపోతున్నాయి) ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలి. ఈ మహమ్మారి నుంచి లక్షలాదిమంది మన అన్నదాతలను కాపాడేందుకు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. దేశ, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తాము చేసిన సూచనలపై వెంటనే స్పందించాల్సిందిగా వారు ఆ లేఖలో కోరారు.