Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తీరుపై ఇటు మీడియా.. అటు ఇతర ప్రపంచ దేశాల నాయకులు స్పందిస్తున్నారు. చైనా లాంటి కొన్ని దేశాలు భారత్‌ను ఆదుకోవడానికి ముందుంటామని ప్రకటనలూ చేశాయి. దేశ ప్రజల్లో ధైర్యాన్ని నింపే మాటలను చెప్పాయి. అయితే.. కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ సమయంలో ప్రధాని మోడీ నుంచి ఈ మాత్రం స్పందన కూడా కరువైంది. దీంతో ప్రధాని తీరుపై వైద్యులు, వైద్యరంగ నిపుణులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానినుద్దేశిస్తూ.. కరోనా యోధుడు, వైద్యుడు లేఖ రాశారు. ప్రధాని మాట్లాడాలనీ, ప్రస్తుత సమస్య పరిష్కారానికి ప్రణాళికేంటో తెలపాలని ముంబయిలోని ఓ ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అక్షరు బహేటీ పేర్కొన్నారు.
'నేను ఒక వైద్యుడిని, కరోనా యోధుడినీ, భారతీయ పౌరుడిని. అయితే, ఈ మూడు పాత్రలతో ప్రస్తుతం నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. దేశ నాయకుడి మార్గదర్శకత్వం ఎంతో అవసరం కాబట్టి నేను ఈ రోజు మీకు లేఖ రాస్తున్నాను. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. మనమంతా కలిసికట్టుగా పని చేసినా సాధించలేని స్థితిలో ఉన్నాం. ప్రస్తుత స్థితిలో భారత్‌కు సహాయం చేయడానికి ప్రపంచం ఐక్యంగా ఉన్నది. కానీ, భారతీయులు మాత్రమే విభజించబడ్డారు. నా వాట్సాప్ గ్రూపులన్నీ వివిధ సమస్యలపై కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం మనం అతిపెద్ద శత్రువు కోవిడ్-19తో పోరాడుతున్నాం. కరోనా మొదటి వేవ్ సమయంలో మీ ప్రసంగాలను అందరూ శ్రద్ధగా విన్నారు. ఇప్పుడు కూడా ఈ విషయంలో అలాగే స్పందించి దేశ ప్రజలకు ధైర్యాన్ని కల్పించండి. ఉమ్మడి పోరాటంలో అందరినీ ఏకం చేయండి' అని లేఖలో పేర్కొన్నారు.
దయచేసి జాతీయ టెలివిజన్‌లో సాయంత్రం ప్రైమ్‌టైమ్ స్లాట్‌లోకి వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అయితే, ప్రస్తుత సంక్షోభం గురించి లేదా ప్రభుత్వం సాయంపై ఇప్పటి వరకు చేసిన దానిపై మాట్లాడటానికి సమయం కేటాయించడం కంటే.. పరిష్కారాల గురించి మాట్లాడండి. మరో సూచన ఏమంటే.. కోవిడ్ విషయంలో అంతర్జాతీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని నిజాలు, సైన్సు మాత్రమే మహమ్మారిని ఓడించగలదని గుర్తుంచుకోండి. మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు, జాతీయవాదం.. ఈ మూడింటిలో ఏ ఒక్కటీ కరోనాకు వ్యతిరేకంగా పని చేయదు. కాబట్టి, ఈ ఒక్కసారి మాత్రం సైన్సును నమ్మండి.
ఆక్సిజన్, ఔషధాల కొరతకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో స్పష్టతనివ్వండి. హౌర్డింగ్ డ్రగ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, సమీప ఆస్పత్రులకు ఇవ్వాలని కోరండి. అమెరికా ఆపరేషన్ వార్ప్ స్పీడ్ మాదిరగానే గొప్ప టీకా పథకాన్ని ప్రకటించండి. క్లినికల్ ట్రయల్ మోడ్ కింద అత్యంత ప్రభావవంతమైన ''నోవావాక్స్''కు ఆమోదమివ్వండి.
మన దేశపు ఆంటోనీ ఫౌసీని గుర్తించండి(మన దేశంలోనూ ఆయన లాగే చాలా మంది వైద్యులు, శాస్త్రవేత్తలు ఉన్నారు). ఆ వ్యక్తితో జాతీయ టీవీ చానెళ్లలో మీరు కనిపించండి. ప్రతి రోజూ ఒక్కో అంశంపై ప్రజలతో చర్చించండి. నివారణ, చికిత్స నుంచి టీకా వరకు ఇలా ప్రతీదీ మాట్లాడండి. ఒకవేళ కావాలనుకుంటే దానికి ''స్వస్త్ కీ బాత్'' అని పేరు పెట్టండి. మోడీ గారు.. మేము మిమ్మల్ని చూడాలి. మీ మాట వినాలి. మీ ప్రణాళిక చెప్పండి. మేము మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఇది మీ బాధ్యత అని సదరు వైద్యుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.