Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా: ఎగువ ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి గంగ నదిలో మృత దేహాలు కొట్టుకుని వస్తుండటంతో సరిహద్దు ప్రాంతంలో భారీ వలను బీహర్ ఏర్పాటు చేసింది. బక్సార్ జిల్లాలోని చౌసా గ్రామంలోని గంగనదికి అడ్డంగా ఈ భారీ వలను అధికారులు ఏర్పాటు చేశారు. సోమవారం, మంగళవారాల్లో 71 మృతదేహాలను బీహార్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ ఎగువ ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినవే అని వారు చెబుతున్నారు. '71 మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశాం. బీహార్-ఉత్తరప్రదేశ్ సరిహద్దు అయిన చౌసా గ్రామంలోని రాణిఘాట్ వద్ద భారీ వల ఏర్పాటు చేశాం' అని బీహార్ రాష్ట్ర జల నిర్వహణ, సమాచార-ప్రజా సంబంధాల శాఖ మంత్రి సంజరు ఝా ట్వీట్ చేశారు. సోమ, మంగళవారాలతో పాటు వరసగా మూడో రోజైన బుధవారం కూడా మృత దేహాలు కొట్టుకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు మృతదేహాలు కొట్టుకురావడంపై అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పాట్నా హైకోర్టు గురువారం ఆదేశించింది.అలాగే మృతదేహాలు కొట్టుకుని వస్తున్న నేపథ్యంలో గంగ నీటిని ఉపయోగించవద్దని వైద్య అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'ఇన్ఫెక్షన్కు దూరంగా ఉండటానికి గంగా నీటిని ఉపయోగించకుండా నది ఒడ్డున నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. నీటిని ఉపయోగిస్తే వైరస్ వ్యాప్తికి అవకాశాలు పెరుగుతాయి' బక్సార్ సివిల్ సర్జన్ డాక్టర్ జితేంద్ర నాథ్ తెలిపారు.