Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిడ్డకు మాత్రం నెగటివ్
- అసోంలో ఘటన
గువహతి: సకాలంలో స్పందించిన పారమెడికల్ సిబ్బందితో కరోనా సోకిన ఓ గర్భవతి సురక్షితంగా అంబులెన్సులోనే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఘటన ఈశాన్య భారతంలోని అసోం రాష్ట్రంల చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. జోర్హాట్ జిల్లాలోని సింటమోనిఘర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటినొప్పులు రావడంతో.. స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. గర్భవతికి కరోనా పాజిటివ్, ఆమె ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న వైద్య బృందం జోర్హాట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు. మార్గమధ్యలోనే ఆమె పరిస్థితి దిగజారుతుండటంతో.. వెంటనే స్పందించిన పారమెడికల్ సిబ్బంది అంబులెన్సును రోడ్డు పక్కన ఆపి.. డెలివరీ చేశారు. అంబులెన్సులోనే ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం వారిని జోర్హాట్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. తల్లి కోవిడ్ వార్డులో ఉండగా.. కరోనా పరీక్షల్లో నవజాత శిశువుకు నెగటివ్ రావడంతో మరో వార్డులో ఉంచామని తెలిపారు.