Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 55శాతం మందిలో కరోనా భయం
- మానసిక ఆందోళనలో 27శాతం మంది
న్యూఢిల్లీ : మురాదాబాద్‌లో నివసిస్తున్న కాంట్రాక్టర్ షాహిద్ అలీ స్వీయ గృహనిర్బంధంలో ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడడు. కరోనా వైరస్ గురించి వచ్చే వార్తలను చూస్తుంటాడు. వైరస్ పేరెత్తగానే.. ఆయనలో మానసిక ఆందోళన ఆవరిస్తున్నది. నోయిడాలో ఉండే రిటైర్డ్ అధికారి సుశీల్కుమార్ది అదే పరిస్థితి. సెకండ్‌వేవ్ వచ్చాక.. అతను ఇంటినుంచి బయటకు రావటమేలేదు. కరోనాతో ఎవరైనా చనిపోయారని వార్త వినగానే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
బిజ్నోర్‌లో నివసించే సురేంద్రసింగ్ యాదవ్‌దీ అదే పరిస్థితి. నిద్రపట్టటానికి స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకోక తప్పటంలేదు. ఢిల్లీకి చెందిన 30 ఏండ్ల పూజాకుమారి ఇంట్లో ఎవరికీ కోవిడ్ లక్షణాల్లేవ్. అయినా ఆమెలో ఒకరకమైన భయాందోళన. ఆక్సిజన్ సిలిండర్ కొనటానికి సిద్ధమైంది.
దేశంలో కరోనా సెకండ్‌వేవ్ సునామీ లాగా రావటమేకాదు. తొలివిడత కన్నా తీవ్రంగా మారింది. దీంతో కోట్లాది కుటుంబాలు కోవిడ్ వైరస్ బారినపడ్డాయి. కేంద్ర సర్కార్ నిర్లక్ష్యం కారణంగా వేలాది కుటుంబాలు ఆప్తులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. వైద్యసేవలు కుప్పకూలాయి. వ్యాక్సిన్లేదు. పడకల్లేవ్. మందులు అందుబాటులో లేకపోయినా పాలకులెవరూ పట్టించుకోవటంలేదు. ప్రభుత్వ వ్యవస్థ చేతులెత్తేసింది. ఇలాంటి వాతావరణం ప్రజల్లో నిరాశ, ఆందోళనకు గురిచేస్తున్నది.
మానసిక ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న డేటా మరింత భయపెడుతుంది. మనస్తత్వవేత్తల ప్రకారం... అంటువ్యాధి సమయంలో కోవిడ్ సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నదని వివిధ రంగాలకు చెందిన నిపుణులు అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మానసిక మహమ్మారి(మెంటల్ పాండమిక్) గా ప్రబలుతున్నదనీ చెబుతున్నారు.
కరోనా నుంచి కోలుకున్నా డిప్రెషన్లోకి...
దేశవ్యాప్తంగా కరోనా పేషంట్లపై ఓ వైద్యుల బృందం సర్వే నిర్వహించింది. ఎంపికచేసిన వెయ్యిమంది భారతీయులపై ఈ సర్వే జరిగింది. ఇందులో 55 శాతం మందికి కరోనా భయం ఉంటే.. 27 శాతం మంది మానసిక ఆందోళన (డిప్రెషన్)కు గురయ్యారు. 'ఆక్సిజన్ కొరత ఉన్నది, ఆస్పత్రుల్లో పడకలు అందుబాటులో లేవు, ప్రజలు దాని గురించి భయపడుతున్నారు. ఒకవేళ మనకు ఏదైనా జరిగితే.. ఏమి చేస్తామన్న ప్రశ్న వారి మనస్సులను పదేపదే తొలిచివేస్తున్నది. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారేకాదు.. కరోనానుంచి కోలుకున్నవారూ ఇలాంటి వేదనలకు గురవుతున్నారని మాక్స్ ఆస్పత్రి సైకియాట్రీ విభాగాధిపతి డాక్టర్ సమీర్ మల్హోత్రా తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ పోస్టులు కూడా ప్రజలను డిప్రెషన్ వైపు నడిపిస్తున్నాయని డాక్టర్ సమీర్ తెలిపారు.
పలుదఫాలు ఆక్సిజన్లెవల్స్ పరీక్షించుకోవటం.. ఇది కూడా డిప్రెషనే...
తమ ఆక్సిజన్ స్థాయి సరిగ్గా ఉన్నదా..లేదా అని పలుసార్లు పరీక్షించుకుంటున్నారు. ఇది డిప్రెషన్‌కు కారణమేనని వైద్యులు అంటున్నారు. అనవసర భయాందోళనల కారణంగా.. గుండే వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. వీటికి తోడు భయం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి ఉంటే కోవిడ్ లక్షణాలు తమకూ ఉన్నాయని భావిస్తారు. అలాంటప్పుడు పదేపదే తమ ఆక్సిజన్ లెవల్స్‌ను పరీక్షించుకుంటారు. పల్స్‌రేటును తనిఖీ చేసుకుంటారు. ఇది కూడా ఆందోళనను మరింతగా పెంచుతుందని వైద్యులు అంటున్నారు.
'క్లినికల్ డిప్రెషన్లో, ఇది ఒక రకమైన వ్యాధి, మనస్సును నిరంతరం ఆందోళనకు గురిచేస్తున్నది. ఒక వారానికి పైగా డిప్రెషన్‌కు గురైతే.. ఏ పనీ చేయాలనిపించదు. చిన్న విషయాలు చాలా భారమనిపిస్తాయి. కండ్లలో కన్నీరు ఉబికివచ్చేస్తుంటది. ఏవేవో ఆలోచనలు మనస్సు నిండా నిండిపోతాయి. ఇవన్నీ డిప్రెషన్‌కు కారణాలని పరిశోధనలో తేలింది.
'కోవిడ్ మహమ్మారి గురించి యువకులు , యాభై ఏండ్లు పైబడిన వారు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. యువత భవిష్యత్‌ను అన్వేషిస్తున్నదశలో.. కోవిడ్ మహమ్మారి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపింది. యాభై ఏండ్లు పైబడిన వారిలో ఒక రకమైన ఒంటరితనం వెంటాడుతున్నది. ఈ రెండు వయస్సుల్లో గరిష్ట సంఖ్యలో కేసులు వస్తున్నాయని డాక్టర్ మలిహా తెలిపారు.