Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో మళ్లీ 4 వేలకు పైనే కరోనా మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో మరణాలు, పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,120 మంది వైరస్‌తో మరణించారు. ఇదే సమయంలో 3,62,727 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాలు 2,58,317 చేరగా, పాజిటివ్ కేసులు 2,37,03,665కు పెరిగాయి. పాజిటివిటీ రేటు 20.9 శాతం, మరణాల రేటు 1.09 శాతంగా ఉంది.
డోసుల మధ్య గ్యాప్ 12-16 వారాలు
కోవిషీల్డ్‌పై ప్రభుత్వ ప్యానల్ సిఫారసు
కరోనా వైరస్ నిరోధించేందుకు అందిస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య సమయాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచవచ్చునని ప్రభుత్వ ప్యానల్ గురువారం ప్రతిపాదించింది. కాగా, మరో వ్యాక్సిన్ కోవాగ్జిన్ మోతాదుల విషయంలో ఎలాంటి మార్పులను సూచించలేదు. ఈ రెండు వ్యాక్సిన్లకు గతంలో మొదటి, రెండవ డోసులకు మధ్య అంతరం సుమారు నాలుగు నుంచి ఆరు వారాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవలం కోవిషీల్డ్‌కు మాత్రమే నేషనల్ ఇమ్యునిజేషన్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్ఐటీజీఏ) ఈ సిఫారసు చేసింది. సార్క్-కోవిడ్-2తో అనారోగ్యం బారిన పడి..కోలుకున్న వారికి ఆరు నెలల పాటు టీకాను వాయిదా వేయాలని ఎన్ఐటీజీఏ సూచించింది. ఈ సూచనలు అమలు చేసేందుకు తమ సిఫార్సులను నేషనల్ ఎక్స్‌ఫర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపించనుంది.
వచ్చే వారంలో మార్కెట్ల్లోకి స్పుత్నిక్ వ్యాక్సిన్
రష్యాకు చెందిన గమలెయా నేషనల్ సెంటర్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ వచ్చే వారం నుంచి దేశ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నది. ఈ విషయాన్ని గురువారం మీడియా సమావేశంలో నిటి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వికె పౌల్ ప్రకటించారు. స్పుత్నిక్-వీ టీకా వినియోగానికి భారత్ ఏప్రిల్‌లోనే ఆమోదం తెలిపింది. ఇప్పటికే టీకాలు మాస్కో నుంచి భారత్‌కు చేరుకున్నాయి.