Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసంఘటిత
- రంగానికి ముప్పు
- ఆర్థిక వ్యవస్థ పైనా ప్రభావం : నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి, ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న పూర్తిస్థాయి, పాక్షిక లాక్డౌన్లు వలసకార్మికులను తిరిగి సొంతూర్ల బాట పట్టేలా చేస్తున్నాయి. హైదరాబాద్ గల్లీ నుంచి మొదలుకుని దేశవ్యాప్తంగా వలసకార్మి కులు బతుకుదెరువుపై లాక్డౌన్పడటంతో.. ప్రస్తుతం నగరాలను విడిచి వెళ్తున్నారు. ఊరికేపోదాం..ఉన్నంతలోనే తిందాం.. అంటూ పొట్టచేతపట్టుకుని తిరిగి మళ్లీ సొంతూరి బాటపడుతున్నారు. మోడీ సర్కార్ కరోనా కట్టడిపై చేతులెత్తేయటంతో దిక్కుతోచని స్థితిలో ఊర్లకు పయనం కడుతున్నారు. అయితే దీని ప్రభావం అసంఘటిత రంగంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపైనా పడుతుం దని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ల కారణంగా ముఖ్యంగా మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల నుంచి వలసకార్మికులు ఇంటి బాటపడుతున్నారు.
మోడీ సర్కారు ముందుచూపు లేకుండా గతేడాది విధించిన లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హఠాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో రెక్కాడితే కానీ డొక్కాడని వలసకార్మికులు ఆకలికి అలమటించారు. దీంతో సొంతూర్లకు వెళ్లాలనే తపనతో కాలినడకన కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో వందలాది మంది వలసకార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ విషయంలో కేంద్రం నుంచి స్పందన కరువవడంతోనే వలసకార్మికులు ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందనీ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొనే ఈ సారి వలసకార్మికులు నగరాలను వీడి సొంతూరు బాటపడుతున్నారని నిపుణులు చెప్పారు.
రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలోని తన సొంత గ్రామమైన కరౌలిలో ఓ భవన నిర్మాణ కార్మికుడు కుటుంబంతో పాటు నివిసిస్తున్నాడు. తాను పొదుపు చేసుకున్న డబ్బు ద్వారానే గతేడాది లాక్డౌన్ కాలంలో ఆయన తన కుటుంబంతో అతి కష్టం మీద జీవనం సాగించాడు. అయితే, పరిస్థితులన్నీ చక్కబడ్డాయని భావించి రెండు నెలల క్రితమే ఆ కార్మికుడు ఉపాధి కోసం దేశరాజధానికి వచ్చాడు. అయితే, రెండు నెలల్లోనే పరిస్థితులు గతేడాదికి మించి దారుణ స్థితికి పడిపోవడంతో ఆ కార్మికుడు తిరిగి నగరాన్ని వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్న వలసకార్మికుల్లో ఉన్నాయి. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో అన్ని నిర్మాణ, పారిశ్రామిక కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో రోజువారీ కూలీలు లక్షలాది మంది ఉపాధిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక హైదరాబాద్‌లోనూ బిల్డింగ్ పనులతో పాటు ఇతరపనులతో వలసకార్మికులు ఉపాధికల్పించుకున్నారు. ఇటీవల లాక్డౌన్ ప్రకటించటంతో..బతికుంటే బలుసాకు తినొచ్చని.. వలసకార్మికులు భారీసంఖ్యలో సొంతూర్లకు పయనమవుతున్నారు. దీంతో జంటనగరాల్లోని రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పదిరోజులే లాక్డౌన్ అంటూ ప్రకటించినా..పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారవర్గాలనుంచి లీకులు వస్తున్నాయి.
కాగా గత ఆర్థిక సంవత్సరం 2020-21లో భారత దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 8శాతం పడిపోయిందని ప్రభుత్వ అంచనాలే సూచిస్తున్నాయి. 1952తర్వాతే ఇది ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అన్ని ఆర్థిక నిపుణులు తెలిపారు. అయితే, సెకండ్ వేవ్ ప్రభావంతో అసంఘటితరంగం దెబ్బతినడంతో పాటు ఆర్థిక వ్యవస్థ నష్టాన్ని అంచనా వేయడమూ కష్టమేనని వెల్లడించారు. ఇప్పటికైనా మోడీ సర్కారు మేల్కొని రాష్ట్రాలకు సూచనలివ్వడంతో పాటు అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు.