Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాపై తామడిగిన సమాచారం లేదన్న ధర్మాసనం
- ఆస్పత్రులు, వైద్యులు, పడకలు, మందులు, ఆక్సిజన్ లభ్యత వంటి వివరాలివ్వాలని ఆదేశం
లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదివరకు కరోనాపై తామడిగిన వివరాలకు ప్రతిస్పందనగా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో సరైన వివరాలు లేవని కోర్టు పేర్కొంది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది. దీంతో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం కరోనా పరిస్థితితులపై విచారణ చేపట్టింది. ఇదివరకటి విచారణలో భాగంగా కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసులు, మరణాలు, కోవిడ్-19 సెంటర్లు వంటి సంబంధిత వివరాలను వెంటనే అందివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తాజాగా న్యాయమూర్తులు సిద్ధార్థ వర్మ, అజిత్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కోవిడ్-19 నిర్వహణకు సంబంధించి కోర్టు ఆదేశాలకు ప్రతిస్పందనగా యోగి సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్‌పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మునుపటి విచారణ సందర్భంగా తామడిగిన సమాచారం అందించలేదనీ, ఇదివరకటి కోర్టు ఆదేశాలు పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం అందించిన సమాచారంలో కరోనా పరీక్షలు తగ్గడం, రాష్ట్రంలో అంబులెన్సుల లభ్యత తక్కువగా ఉండటం, కరోనా బులిటెన్‌కు సంబంధించి జిల్లా పోర్టల్స్ అప్డేట్ లేకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని 22 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. పలు ఆస్పత్రుల్లో బిపాప్ యంత్రాలు, హై ఫ్లో నాసల్ కన్యులా మాస్కుల వంటి లైఫ్ సపోర్టు సిస్టమ్‌లో అందుబాటులో లేవని అఫిడవిట్లో గుర్తించింది.
అలాగే, లెవల్-1, 2, 3 కేటగిరి ఆస్పత్రులకు సరఫరా చేసే ఆహారం వివరాలు కూడా ఇవ్వలేదనీ, లెవల్ 1 కేటగిరి ఆస్పత్రిలో ప్రతిరోగికి రూ.100 కేటాయించడంతో.. కరోనా రోగులకు పోషకాహారం ఎలా అందుతుందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మరణాల వివరాలు సైతం సరిగ్గా లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. సన్ ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంపై జిల్లా యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రిపై ఎఫ్ఐఆర్ నమోదును నుంచి ఉపశమనం కల్పించింది. తదుపరి విచారణలోపు ప్రతినగరంలోని జనాభా, ఆస్పత్రుల సంఖ్య, పడకలు, ఆక్సిజన్, మందుల లభ్యత, వైద్యులు, పారమెడికల్ సబ్బంది సంఖ్య వంటి పలు వివరాలను అందివ్వాలని ఆదేశించింది.