Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సెంట్రల్ విస్టా ప్రాజెక్టు'పై కేంద్రం
న్యూఢిల్లీ : సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సంబంధించి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలపై మోడీ సర్కారు నిషేధం విధించింది. కరోనా సెకండ్ వేవ్ ఆపత్కాల సమయంలో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సెంట్రల్ విస్టా నిర్మాణ పనులు కొనసాగించడంపై కేంద్రం మీద విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. దీంతో ఈ విమర్శల నడుమే తాజా నిషేధాన్ని విధిస్తూ 'సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్' ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ఆపేయాలంటూ 12 ప్రతిపక్షపార్టీల నాయకులు బుధవారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ నిర్మాణ పనులకయ్యే మొత్తాన్ని ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొనుగోలుకు మళ్లించాలని అందులో కోరారు. అలాగే, పౌర సంఘాలు, పర్యావరణ సంస్థలకు చెందిన దాదాపు 65 మంది ప్రముఖులు సైతం ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. అయితే, ఇవేమీ పట్టించుకోని మోడీ సర్కారు 'సెంట్రల్ విస్టా ప్రాజెక్టు'లో తమ మార్కు ఉండాలనే తపనతో, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి నిర్మాణ పనులను కొనసాగిస్తున్నదని రాజకీయపార్టీల నాయకులు, పౌర సంఘాల నాయకులు, పర్యావరణవేత్తలు ఆరోపించారు.