Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేదీని తెలపాలని కేంద్రాన్ని కోరిన కేరళ హైకోర్టు
కోచి : కేరళకు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే తేది సూచించాల్సిందిగా కేరళ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. సరళీకరించిన ధరల విధానం, కోవిడ్ వ్యాక్సినేషన్ వ్యూహాన్ని పక్కనబెట్టాల్సిందిగా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దానిపై విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ పై ఆదేశాలు వెలువరించింది. అన్ని వయసుల వారికి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా వ్యాక్సిన్లను పంపిణీ చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. ఆసక్తి గలవారికి, వ్యాక్సిన్ తయారీ సామర్ధ్యం గలవారికి కోవాక్సిన్ తయారీ సాంకేతికతను బదిలీ చేయాల్సిందిగా కూడా కోరారు. వ్యాక్సిన్ల వల్ల మరణాల రేటును తగ్గించవచ్చని, అందువల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇక ఎంత మాత్రమూ జాప్యం చేయరాదని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్రం తరపు న్యాయవాది మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ వ్యాక్సిన్ల పంపిణీని పర్యవేక్షిస్తోందని తెలిపారు. రాష్ట్రానికి వ్యాక్సిన్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ తిరిగి 21న జరగనుంది.