Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకవైపు వ్యాక్సిన్ల కొరత.. మరోవైపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇబ్బందులు
- తగ్గుతున్న లబ్ధిదారులు.. పెరుగుతున్న ప్రభావం
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంతో కనీస వైద్య సదుపాయాలు అందక లక్షలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత అధికంగా ఉండటం రోగుల పాలిట శాపంగా మారింది. దీనికి తోడు టీకాల కోరత అధికంగా ఉండటం దేశంలో పరిస్థితులను మరింత దారుణంగా మారుస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో వాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహించాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ దీనికి అనుగుణంగా టీకాలు సరఫరా చేయలేదు. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో టీకాలిచ్చే పలు కేంద్రాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఈ క్రమంలోనే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు టీకాల కొరత తీర్చాలని కేంద్రానికి లేఖలు సైతం రాశాయి.
ఇదిలా ఉండగా, టీకాల లభ్యత గ్రామీణ భారతంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎందుకంటే టీకాల అసమానత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆస్పత్రులకు టీకాల లభ్యత తగినంతగా లేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. టీకా లబ్ధిదారుల ప్రధాన్యత క్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి 18 నుంచి 44 ఏండ్ల మధ్యనున్న వారికి టీకాలు అందించడానికి సిద్ధమైంది. అయితే, ఇప్పటికీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించలేదు. వీరు టీకాలు పొందడానికి ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధన విధించింది. అయితే, చాలా మంది రిజిస్టర్ చేసుకోకుండానే టీకా కేంద్రాలకు వస్తున్నారు. దీంతో వారికి టీకాలు అందడం లేదు. దీనికి ప్రధానం కారణం టీకాలు తీసుకోవడానికి ముందస్తు రిజిస్ట్రేషన్ గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించకపోవడం. టీకాల కొరత.
అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్టర్ చేసుకోవడానికి తగిన సౌకర్యాలు లేకపోవడం. దేశంలో సగం జనాభాకు ఇంటర్నేట్ సౌకర్యం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో టెలీ డెన్సిటీ 60 శాతం కంటే తక్కువగా ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు అత్యల్ప టెలీ డెన్సిటీలో ఉన్నాయి. అలాగే, స్మార్ట్ఫోన్ కలిగి ఉన్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో టీకా రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారు. అలాగే, టీకా నమోదులో ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలు లేకపోవడం అవరోథంగా మారిందని సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ పేర్కొంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే, రిజిస్టర్ చేసుకుని వెళ్లిన టీకాలు అందడం లేదు. దీనికి ప్రధాన కారణం టీకాల కొరత. ఇలాంటి అవరోధాల నేపథ్యంలో గ్రామీణ భారతం టీకా సమస్యల్లో చిక్కుకోంది. దేశంలో జనవరి 16 నుంచి మే 9 మధ్య కాలంలో మొత్తం 16.84 కోట్ల డోసులు వేశారు. మే 7తో ముగిసిన వారలో మొత్తం 1.16 కోట్ల డోసులు ఇచ్చారు. గత ఎనిమిది వారాల్లో ఇది అతి తక్కువ. గతంలో మార్చితో 12తో ముగిసిన వారంలో కోటి కంటే తక్కువ డోసులు అందించారు. ప్రస్తుతం టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయి వేటు, కార్పొరేట్ ఆస్పత్రులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు గ్రామీణ భారతంపై కరోనా పంజా విసరడం ఆందోళన కలిగిస్తోంది.