Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతీ ఒక్కరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ అవసరం. సుమారు 90 కోట్ల మంది జనాభా 18 ఏళ్ళు పైబడినవారు ఉన్నారని అంచనా. వీరందరికీ రెండేసి డోసుల చొప్పున వ్యాక్సిన్ అవసరం. అంటే మొత్తం 180 కోట్ల డోసుల వ్యాక్సిన్ కావాలి. ఇది కనీస అంచనా మాత్రమే. నీతి ఆయోగ్ లెక్క ప్రకారం 95 కోట్ల మందికి రెండేసి డోసులు కావాలి.
2021 మే 13 వ తేదీ నాటికి 3కోట్ల 96 లక్షల మందికి రెండు డోసులు పూర్తయ్యాయని నీతి ఆయోగ్ తెలిపింది. మరో 13 కోట్ల 76 లక్షల మందికి మొదటి డోసు మాత్రమే అందింది. కాని నీతి ఆయోగ్ సభ్యుడు డా. వి.కె.పాల్ ఆగస్టు-డిసెంబరు మధ్య 216 కోట్ల డోసుల వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చేస్తాయని నమ్మబలుకుతున్నారు.
ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ సరఫరా పరిస్థితిపై సుప్రీం కోర్టు కు కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ సమర్పించింది. అందులో పేర్కొన్న వివరాలకు, నీతి ఆయోగ్ సభ్యుడు వి కెపాల్ ప్రకటనకు పొంతనే లేదు.
''పగలల్లా బారెడు నేశాను, దివ్వె తీసుకురా, దిగనేస్తాను'' అన్న చందాన ఉంది నీతి ఆయోగ్ ప్రకటన. మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16న మొదలైంది. కరోనాను జయించి (?) భారతదేశం ప్రపంచానికే దారి చూపించింది అంటూ ప్రధాని మోడీ ఆరోజు ప్రకటించారు. ఆ ప్రకటన లోని డొల్లతనం ఏమిటో ఇప్పుడు ప్రపంచం ముందు బట్టబయలైంది. రోజువారీ అత్యధిక కేసులతో, అత్యధిక మరణాలతో భారత దేశం ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువగా కరోనాతో సతమతమౌతున్న దేశంగా ఉంది. ఆ విషయాన్ని పక్కన బెడితే, జనవరి 16 నుంచి మే 13 వరకు గడచిన 117 రోజుల్లో మొత్తం 21 కోట్ల 68 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. అంటే రోజుకు 18.5 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ అందించగలిగారు. ఇదే వేగంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగితే మొత్తం 90 కోట్ల మందికీ, రెండు డోసుల చొప్పున అందించడానికి ఇంకో 856 రోజులు పడుతుంది. అంటే 2023 సెప్టెంబరు 15 అవుతుంది !
అబ్బెబ్బే ! మేము వ్యాక్సిన్ సేకరణ ప్రక్రియ వేగవంతం చేశాం కాబట్టి ఈ ఏడాది డిసెంబరుకు, మహాఅయితే వచ్చే ఏడాది మార్చి నాటికి అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసేస్తాం అంలున్నారు వికె పాల్. ఆయన మాటల్లోనే ఇప్పటికి కొనుగోలు చేసిన వ్యాక్సిన్లు 35.6 కోట్ల డోసులు. అంటే ఆర్డరు పెట్టినవన్నమాట. అందులో ఎన్ని ప్రజలకు అందాయి ? మళ్ళీ ఆయనగారి ప్రకటనలోనే మే నెలాఖరుకి 19.6 కోట్ల డోసులు ప్రజలకు అందుతాయి. ఇంకొక చోట మే 13 నాటికే 21 కోట్ల 68 లక్షల డోసులు అందించామని చెప్పారు. ఇలా పరస్పరం పొంతన లేని విషయాలు ఆయన ప్రకటనలో చాలా ఉన్నాయి. ప్రజలను గందరగోళ పరచడమే ఆ ప్రకటన ఉద్దేశమని స్పష్టంగా తేలుతోంది. ఏ సంస్థ నుండి ఏ తరహా వ్యాక్సిన్లు ఏ రోజునుంచి ఎన్నెన్ని అందించబోతున్నారన్న వివరాలు ఏవీ ఆ ప్రకటన లో లేకపోవడం గమనార్హం. అలాగే ఏ కంపెనీ నుండి ఎన్నెన్ని వ్యాక్సిన్ లు ఏ తేదీనుండి రానున్నాయో ఆ వివరాలూ లేవు. అందుచేత సుప్రీం కోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ లోని వివరాలనే మనం ప్రాతిపదికగా తీసుకుని పరిశీలించాల్సివుంటుంది.
ప్రస్తుతం మన దేశంలో రెండే రకాల వ్యాక్సిన్లు అందుతున్నాయి. ఒకటి కోవిషీల్డ్. దీనిని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారు చేస్తోంది. దీని ఉత్పత్తి సామర్ధ్యం నెలకు 6 కోట్ల 50 లక్షల డోసులు. రెండోది కోవ్యాక్సిన్. దీనిని భారత్ బయోటెక్ (బిబి)
ఉత్పత్తి చేస్తోంది. దీని సామర్ధ్యం నెలకు ఒక కోటి డోసులు. రెండూ కలిపితే నెలకు 7 కోట్ల 50 లక్షల డోసులు. రెండు సంస్థలూ ప్రతి రోజూ పూర్తి సామర్ధ్యంతో ఉత్పత్తి చేయగలిగితే
( ఆచరణలో ఇది ఎవరికీ సాధ్యపడదు. కొంత గ్యాప్ ఉంటుంది) రోజుకు 25 లక్షల డోసులు అందించగలుగతాయి. ఆ లెక్కన చూస్తే మరో 640 రోజులు పడుతుంది. అంటే మార్చి 2023.
మరి పరిష్కారం ఏమిటి ? భారతదేశానికి వ్యాక్సిన్లను సరఫరా చేస్తామంటూ ఏ దేశమైనా ముందుకొచ్చిందా అంటే అటువంటి పరిస్థితి ఏదీ లేదు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో తక్కిన దేశాలకన్నా ఎక్కువ ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నది మన దేశానికే. స్పుత్నిక్, ఫైజర్, మోడర్నా వంటి కంపెనీల తో సంప్రదింపులు జరుపుతున్నామంటున్నారు. ఆ సంప్రదింపులు సాంకేతికత బదలాయింపు కోసమే తప్ప బైటనుండి వ్యాక్సిన్ల సరఫరా కోసం కాదు. మన దేశంలోనే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలు, ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. వాటికి కంపల్సరీ లైసెన్సింగ్ పద్ధతిలో ఉత్పత్తి చేయడానికి అనుమతులిచ్చి ఒప్పందాలు చేసుకోవాలి. మన ప్రభుత్వ పెట్టుబడితో, ప్రభుత్వ పరిశోధనా సంస్థల కృషితో కనుగొన్న వ్యాక్సిన్ కోవ్యాక్సిన్. దానిమీద గుత్తాధిపత్యాన్ని భారత్ బయోటెక్ కు సమర్పించుకున్నది మోడీ ప్రభుత్వం. ఇప్పటి అత్యవసర పరిస్థితిలో ఎవరికైనా ఉత్పత్తికి అనుమతులిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఏ పేటెంటు చట్టాలూ అందుకు అడ్డం కాబోవు. కాని అటువంటి కంపల్సరీ లైసెన్సింగ్ విధానానికి తాను సిద్ధంగా లేనని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ప్రభుత్వం పేర్కొంది. అంటే భారత్ బయోటెక్ గుత్తాధిపత్యాన్ని ప్రభుత్వం సమర్ధిస్తోంది.
రెండే రెండు కంపెనీలకు మాత్రమే అనుమతులిచ్చి అవసరానికి తగినన్ని వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయలేని పరిస్థితి కల్పించింది మోడీ ప్రభుత్వమే. ఈ ఏడాది జనవరిలో కేవలం ఒకటిన్నర కోట్ల డోసుల కొనుగోలుకు, తిరిగి మార్చిలో మరో 11 కోట్ల డోసుల కొనుగోలుకు ఆర్డరిచ్చింది. ప్రభుత్వం ఆచరణ ఈ తీరుగా ఉంటే నీతి ఆయోగ్ మాత్రం ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది. ప్రజలకు మాత్రం నరకమే కనిపిస్తోంది.
(ఫీచర్స్ అండ్ పాలిటిక్స్)