Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగత ప్రతిష్టకు భంగం
- ఆయన అనుచరుల్లోనూ సన్నగిల్లిన విశ్వాసం
- కరోనా కట్టడిలో కేంద్రం గందరగోళ చర్యలే కారణం : విశ్లేషకులు
న్యూఢిల్లీ : కరోనా సెకండ్‌వేవ్ మోడీ ప్రతిష్టకు భంగం కలిగించింది. ఆయనపై దేశ ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా చేసింది. అంతేకాదు, ఆయనను తీవ్రంగా నమ్మే అనుచరుల్లో సైతం విశ్వాసం తగ్గిపోయింది. అయితే, కరోనా సెకండ్‌వేవ్ ను కట్టడి చేయడంలో మోడీ సర్కారు గందరగోళ చర్యలు, ముందుచూపులోపించడం వంటివి ప్రస్తుత పరిస్థితికి దారి తీసిందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు.
మోడీ వ్యక్తిత్వ ఆరాధానకు అలవాటైన ఆయన అనుచరగణం గతంలో ఆయన చేపట్టిన ప్రతి విఫల చర్యనూ సమర్థించడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నదని విశ్లేషకులు తెలిపారు. కేంద్రం తీసుకునే చర్యల విషయంలో దేశంలోని ప్రజలను నమ్మించడంలో వారు తీవ్ర కష్టాలూ పడ్డారన్నారు. '' పెద్ద నోట్ల రద్దును భరించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిరసనలను చూశారు. లాక్డౌన్ సమయంలో పేదలు, వలసకార్మికుల విషయంలోనూ మోడీ అనుచరవర్గం సమర్థించుకుంటూ వచ్చింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడి, హింసాత్మక నిరసనలకు దారి తీసినప్పటికీ భరించారు. అయితే, కరోనా సెకండ్‌వేవ్ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి'' అని విశ్లేషకులు చెప్పారు.
దేశంలో కరోనా మొదటి వేవ్‌ను కట్టడి చేసి, ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని ఈ ఏడాది ఏప్రిల్ నెలకు ముందు కేంద్రం గొప్పలు చెప్పుకున్నది. అయితే, కొన్ని రోజులకే దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి కొనసాగింది. ఫస్ట్‌వేవ్‌లో రోజుకు దాదాపు లక్షకు చేరువలో కేసులు నమోదైతే.. సెంకడ్వేవ్లో ఆ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవడం ప్రారంభమయ్యాయి. రోజువారీ మరణాలు సైతం అధికమయ్యాయి. రికవరీ రేటూ తగ్గిపోయింది. దేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. దేశంలోని ఆస్పత్రుల్లో బెడ్లు, రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ సరఫరా లేక కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి చేజారిందన్న విషయాన్ని గ్రహించిన కేంద్రం.. బాధ్యతను విస్మరించింది. భారాన్ని రాష్ట్రాలపై వేసి చేతులు దులుపుకున్నదని విశ్లేషకులు చెప్పారు. ఈ చర్యలతో మోడీ ప్రతిష్టను దెబ్బతీసిందని నిపుణులు విశ్లేషించారు. '' దేశ ప్రజలలో మోడీపై నమ్మకం సన్నగిల్లింది. చివరకు ఆయన వీర అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు సైతం మోడీని విశ్వసించే సాహసం చేయడంలేదు'' అని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఇందుకు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా ఇందుకు నిదర్శనమని వివరించారు.
మతం, జాతీయత వంటి భావోద్వేగాలతో ఇన్ని రోజులూ ప్రజల్లో గందరగోళం సృష్టించిందని విశ్లేషించారు. 'లాభాదాయక ప్రత్యర్థి'ని తయారు చేసి ఏడేండ్లుగా బీజేపీ లబ్ధి పొందిందన్నది కాదనలేని సత్యమనీ, ఇందుకు పాకిస్థాన్, చైనా వంటి దేశాలను శత్రువులుగా చిత్రికరించి ఓట్లు దండుకోవడంలో మోడీ సర్కారు సఫలమైందని చెప్పారు. అయితే, ఇలాంటి మత, జాతీయవాదంతో కూడిన భావోద్వేగాలు కరోనా వంటి విషయాల్లో పని చేయవనీ, ఇన్ని రోజులూ కేంద్ర ప్రతి చర్యనూ గుడ్డిగా నమ్మి వాదిస్తూ వచ్చిన కాషాయ పార్టీ కార్యకర్తలు, మోడీ భజనపరులకు ఇప్పుడు స్పష్టత వచ్చిందని తెలిపారు.