Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వేవ్ వస్తుందని కేంద్రానికి ముందే హెచ్చరికలు
- అయినా.. పట్టించుకోని మోడీ సర్కార్
- ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం కోసం దాచిపెట్టారు : రాజకీయ విశ్లేషకులు
- ఆక్సీజన్ ప్లాంట్లు అర్జెంట్.. అని చెప్పినా.. టెండర్లు పిలవడానికి 8నెలలు పట్టింది
- వేలాది మంది ప్రాణాలు పోతున్నా.. కదలికలేని బీజేపీ ప్రభుత్వం
కరోనా రెండో వేవ్ వస్తుందని భారత ప్రభుత్వానికి ముందే తెలుసా? ఒకవేళ వైరస్ విజృంభిస్తే.. పేషంట్లకు ఆక్సీజన్ పెట్టాలని..పెద్దమొత్తంలో డిమాండ్ ఏర్పడుతుందని 'ఎంపవర్డ్ గ్రూప్' (కేంద్రం ఏర్పాటుచేసిందే) గత ఏడాదే హెచ్చరించిందా?.. అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. దేశంలో ప్రమాదకర వైరస్ (బి.1.1.7) వచ్చిందని తెలిసీ.. ప్రధాని మోడీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు చేసుకున్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ప్రజలు నేడు మూల్యం చెల్లిస్తున్నారని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
న్యూఢిల్లీ : అత్యంత ప్రమాదకరమైన కరోనా వేరియెంట్...బి.1.1.7 వైరస్ ఈ ఏడాది మార్చికన్నా ముందే మనదేశంలోకి ప్రవేశించింది. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ మార్చి 24న అధికారికంగా నిర్ధారణ చేసుకుంది. ఇది ఆషామాషీగా తీసుకునే విషయం కాదు. వైరస్వ్యాప్తిని అడ్డుకునేందుకు..ఆఘమేఘాల మీద చర్యలకు ఉపక్రమించాలి. కానీ మోడీ సర్కార్..ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది. అసోం, పశ్చిమ బెంగాల్లో 23 ఎన్నికల సభల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ, ఆయన అధికారగణం ఏర్పాట్లు చేసుకుంది. ఈ నిర్లక్ష్యమే..దేశాన్ని నిండాముంచిందని వైద్య నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వేరియెంట్ వల్లే నేడు వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
మిగతా దేశాలను చూశాక కూడా..నేర్చుకోలేదు
బి.1.1.7 మరీ డేంజర్ కాదుగానీ..ఇది వేగంగా వ్యాప్తిచెందుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ దేశాలు ఈ ఏడాది జనవరిలో బి.1.1.7 వేరియెంట్ ప్రమాదాన్ని గుర్తించాయి. ఈ దేశాలన్నీ వెంటనే వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలకు ఉపక్రమించాయి. లాక్డౌన్లు పెట్టాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లుచేసుకున్నాయి. బి.1.1.7 వేరియెంట్‌ను అమెరికా, బ్రెజిల్, ఇండియా తేలిగ్గా తీసుకున్నాయి. ఈ వేరియెంట్ ప్రమాదకరమని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌కు కూడా తెలుసు. అయినా చర్యలు చేపట్టలేదు. విషయం తెలిసినా నియంత్రించే చర్యలకు ఉపక్రమించకుండా మోడీ సర్కార్ ఎన్నికల ప్రచారంలో పడింది. కోవిడ్ నియంత్రణ పక్కకు పోయింది.
బి.1.1.7 దెబ్బతీసింది !
కరోనా వైరస్ తన స్వరూపం (మ్యూటెంట్) మార్చుకున్నాక అసలు కథ మొదలవుతుందని శాస్త్రవేత్తలు నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు. బెల్జియం, ఇరాన్, దక్షిణ కొరియా, జర్మనీ, చెక్ రిపబ్లిక్, స్పెయిన్, అమెరికా దేశాల్లో అల్లకల్లోలానికి కారణం రూపాంతరం చెందిన వైరసే. వైరస్‌పై నిజమైన పోరాటం ఇప్పుడే మొదలవుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు. బ్రిటన్‌లో బి.1.1.7 వైరస్‌ను పరిశోధకులు డిసెంబరు, 2020లో గుర్తించారు. ఇది తెలిసినవెంటనే...అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ పొడగించింది. మరికొద్ది వారాల్లో బ్రెజిల్ వేరియెంట్ (పి.1), దక్షిణాఫ్రికా వేరియెంట్ (బి.1.351) కూడా గుర్తించారు. మిగతా వేరియెంట్స్‌తో పోల్చితే ఈ రెండు వేరియెంట్స్ అత్యంత డేంజర్ అని తేలింది. అప్పటికీ మనకు ఇంకా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. అంటే దీనిని అడ్డుకునే మార్గం లాక్డౌన్ ఒక్కటేనా!
రూ.200కోట్లు వెచ్చించలేరా?
మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో భవిష్యత్తులో ఎలాంటి ఔషధాలు, ఎలాంటి మందులు, ఎంత సామాగ్రి అవసరమో అధ్యయనం చేయడానికి గత ఏడాది కేంద్రం 11 ఎంపవర్డ్ గ్రూప్స్‌ను ఏర్పాటుచేసుకుంది. ఇవి కేంద్రానికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశాయి. వైరస్ విజృంభిస్తే..పేషంట్లను కాపాడటానికి మెడికల్ ఆక్సీజన్ పెద్దమొత్తంలో అవసరమమవుతుందని 'ఎంపవర్డ్ గ్రూప్' ముందే అంచనావేసి చెప్పింది. కేవలం రూ.200కోట్లతో 162 ఆక్సీజన్ తయారీ ప్లాంట్లకు టెండర్లు పిలవచ్చునని తెలిపింది. పీఎం కేర్స్ కింద మోడీ సర్కార్ భారీమొత్తంలో విరాళాలు సేకరిస్తున్న సమయంలో ఈ సూచనలు వచ్చాయి. అయితే ఇవేవీ కేంద్రం సీరియస్‌గా తీసుకోలేదని ఇప్పుడు తేలిపోయింది. వైరస్‌తో జరుగుతున్న పోరా టాన్ని...ప్రధాని మోడీ వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారని, వైరస్‌పై విజయం సాధించేశామని ప్రజల్లో ప్రచారం చేసుకోవడానికి అలవాటుపడ్డారని విమర్శలున్నాయి.
క్రెడిట్ అంతా తనకే దక్కాలనే వ్యూహమా?
కరోనా సంక్షోభం నుంచి భారతదేశాన్ని రక్షించిన నేతగా పేరు ప్రఖ్యాతలు తనకు మాత్రమే దక్కాలని ప్రధాని మోడీ భావిస్తున్నారట. అంతా బాగుంది వైరస్‌పై విజయాన్ని సాధించాం(డిసెంబరు , 2020నాటికి) , ఇదంతా ప్రధాని మోడీ నాయకత్వం వల్లే సాధ్యమైంది..అని బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకోవటం అందరమూ చూశాం. ఇదంతా కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలుపుకోసమని తెలిసిందే. మహమ్మారి సంక్షోభాన్ని అడ్డుపెట్టుకొని పీఎంఓ కార్యాలయాన్ని అత్యంత శక్తిమంతం చేయటం వెనుక రాజకీయ వ్యూహముందని అనుమానాలున్నాయి.