Authorization
Mon Jan 19, 2015 06:51 pm
4వేలు : కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
- భయపెడుతున్న యాక్టీవ్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. మరోవైపు వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నాలుగు లక్షల మార్కును దాటిన కేసులు..ఐదు రోజులుగా ఆ మార్కుకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా (శుక్రవారం ఉదయం నాటికి) 3.43 లక్షల మందికి కరోనా సోకింది. ఇక మరణాల సంఖ్య నాలుగువేలుగా ఉందని కేంద్ర ఆరోగ్యమంతిత్వ్ర శాఖ వెల్లడించింది. నిన్నటితో పోల్చితే కేసులు, మరణాల సంఖ్యలో కూడా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. అయితే అనేక రాష్ట్రాల్లో యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు, ఆర్టీపీసీఆర్ టెస్టు కిట్ల కొరత నెలకొందని, ఈనేపథ్యంలో కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్న కారణంగా..పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుదలకు దారితీసిందని నిపుణులు చెబుతున్నారు.ఇక తాజాగా దేశవ్యాప్తంగా 18,75,515 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 3,43,144మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. క్రితం రోజు (3,62,727)తో పోల్చుకుంటే కొత్త కేసులు కాస్త తగ్గాయి. దాంతో ఇప్పటివరకు రెండు కోట్ల 40లక్షలమందికి ఈ మహమ్మారి సోకగా, రెండు కోట్లమందికిపైగా దాన్నుంచి బయటపడ్డారు. గురువారం 3,44,776మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,000,79,599గా ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 83.50శాతంగా ఉంది.
క్రియాశీల రేటు 15.41శాతం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,04,893మంది కరోనాతో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 15.41శాతంగా కొనసాగుతోంది. మరోవైపు గురు వారం 4వేలమంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తంగా 2,62,317మంది ఈ వైరస్‌కు బలయ్యారు. కరోనా టీకా ప్రక్రియ వేగవంతం చేసేందుకు మరిన్నికొత్త టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. గురువారం 20,27,160 మందికి టీకాలు అందించింది. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 18కోట్లకు చేరువైంది.
ప్రత్యేకబాక్స్లో..
- కరోనా కేసుల్లో మరణాల రేటు 1.09శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది.
- 10 రాష్ట్రాల్లో రికవరీ రేటు 71.16శాతం నమోదైంది.
- మొత్తం యాక్టీవ్ కేసుల్లో 79.7శాతం 12 రాష్ట్రాల్లో నమోదైంది.
- శుక్రవారం ఉదయంనాటికి మొత్తం 17,92,98,584 వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
- స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారతీయ మార్కెట్లో వచ్చేవారం నుంచి అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది.