Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీమా కోరేగావ్ కేసు నిందితుల కుటుంబసభ్యులు
ముంబయి : కరోనా వ్యాప్తితో తలోజ జైల్లోని ఖైదీల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని బీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన వారి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. 2018 నాటి ఈ కేసులో 84 ఏళ్ల స్టాన్‌స్వామితో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జైల్లో ఉన్న స్టాన్‌స్వామితో ఫాదర్ జోసెఫ్ జేవియర్ శుక్రవారం ఉదయం మాట్లాడారు. స్టాన్‌స్వామి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని, చాలా నీరసంగా ఉన్నారని జేవియర్ శనివారం వర్చువల్ మీడియా సమావేశం ద్వారా పేర్కొన్నారు. తలోజా జైల్లోని పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, కోవిడ్ బారిన పడుతున్న ఖైదీల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ఆధార్ కార్డు లేకపోవడంతో స్టాన్‌స్వామికి వ్యాక్సిన్ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. సామాజిక ఉద్యమకారిణి హర్షాలి పోట్దార్ మాట్లాడుతూ.. జైల్లోని అనేకమంది సిబ్బందితో పాటు క్యాంటీన్ ఉద్యోగస్తులకు కరోనా సోకిందని తెలిపారు. అధికారులు ఆరోగ్యం బాగున్న వారికి పరీక్షలు నిర్వహించి, అనారోగ్యంతో ఉన్నవారిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది మంది పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల బ్యారక్‌లో ఉండే ఇతర నిందితులు సుధీర్ ధావలే, వెర్నోన్ గాన్స్లేవ్స్లకు ఇంకా కరోనా పరీక్షలు కూడా చేయలేదని తెలిపారు. దీనిపై వారు జైలు అధికారులకు ఫిర్యాదు చేస్తే.. కుటుంబసభ్యులతో ఫోన్‌కాల్స్, భేటీలను ఆపేస్తామని హెచ్చరించారు. ఈ విధంగా మానసిక హింసకు గురవుతున్న ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వీరితోపాటు ఇతర ఖైదీల ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.-