Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
- 170 రోజుకు చేరిన రైతు ఉద్యమం
న్యూఢిల్లీ : కేంద్రం ఏకపక్షంగా తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేపడుతోన్న ఆందోళనలు ఈ నెల 26కు ఆరు నెలలు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రోజున బ్లాక్ డేగా నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం ప్రకటించింది. వర్చువల్ సమావేశంలో ఎస్కేఎం నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ ప్రజలు ఇంటి వద్ద , వాహనాలపై, దుకాణాల వద్ద నల్ల జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 'ఈ నెల 26న వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు చేపట్టి ఆరు నెలలు కావస్తుండటంతో పాటు మోడీ తొలిసారిగా పాలన చేపట్టి ఏడేండ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆ రోజున బ్లాక్ నిర్వహించనున్నాం' అని పేర్కొన్నారు. మే 26న నిర్వహించే బ్లాక్ డేకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.
170వ రోజుకు చేరిన రైతు ఉద్యమం
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం శనివారం నాటికి 170వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్ సరిహద్దుల్లో రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగస్వామ్యం అవుతున్నారు. ఒకపక్క చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగిస్తూనే, మరోవైపు కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు.