Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్లు ధ్వంసం, కూలిన చెట్లు,
- కరెంటు సరఫరాకు అంతరాయం
- తీర ప్రాంతాల్లో సామాన్య జనజీవనం అస్తవ్యస్తం..
- పెద్ద ఎత్తున సహాయ శిబిరాలకు తరలింపు
- ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
తిరువనంతపురం : తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కేరళను ముంచెత్తాయి. సాధారణ జనజీవనంపై దీని ప్రభావం పడింది. పలు చోట్ల ఇండ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సమాచారం ప్రకారం.. ఉత్తర కేరళలోని ఐదు జిల్లాలు మలప్పురం, కోజీకోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గొడ్ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్‌ను ప్రకటించారు. ఉరుములతో కూడిన వర్షాలు కురవడంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కడ్, మలప్పురం, కోజీకోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గొడ్ జిల్లాలో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మీనాచిల్, అచంకోవిల్, మణిమాల వంటి పెద్ద నదుల్లో వరదనీరు వచ్చి చేరడంతో నీటి మట్టం స్థాయి క్రమంగా పెరుగుతున్నది. దీంతో నదీపరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కొండ ప్రాంతం ఇడుక్కి జిల్లాలోని కల్లర్కుట్టి, మలంకర, భూతాతన్కెట్టు డ్యాంల గేట్లను తెరిచారు. దీంతో పతనమ్‌తిట్టలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగాపలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. అవి ఇండ్లపై, వాహనాలపై పడటంతో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని అధికారులు, బాధితులు తెలిపారు. ఇడుక్కిలోని మున్నార్-వట్టవడ రోడ్డుపై కొంత సమయం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, నేలమట్టమైన చెట్లను తొలగించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగిందని అధికారులు తెలిపారు. తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిసూర్, మలప్పురం జిల్లాల్లో తీవ్ర వర్షాలు, ఎదురుగాలులతో తీవ్ర బీభత్సం సృష్టించే అవకాశం కనిపిస్తున్నదని అధికారులు తెలిపారు. బలమైన గాలుల కారణంగా రాష్ట్రంలో పాత సముద్ర బ్రిడ్జిల్లో ఒకటైన వలియతుర పీర్ పగుళ్లు ఏర్పడ్డాయి. సముద్ర జలాలు తీవ్ర వేగంతో ప్రవహించి తీర ప్రాంతాల్లోని ఇండ్లను ధ్వంసం చేశాయి. దీంతో తీర ప్రాంతాలకు చెందిన ప్రజలను అధిక సంఖ్యలో అధికారులు కోవిడ్-19 మార్గదర్శకాలు అనుసరిస్తూ సహాయక శిబిరాలకు తరలించారు.
అరేబియా సముద్రం మీదుగా తీవ్ర పీడనం : తౌక్టే తుఫానుగా మార్పు
అరేబియా సముద్రం మీదుగా తీవ్ర పీడనం తీవ్రమైందనీ, అది తౌక్టే సైక్లోనిక్ తుఫానుగా మారిందని ఐఎండీ తెలిపింది. ఇది గుజరాత్ తీరం పోర్బందర్, నలియా మధ్య ఈనెల 18 తీరం దాటొచ్చని అంచనా వేసింది. అలాగే, ఈ తుఫాను నేటి నుంచి (16 నుంచి) 18 మధ్య తీవ్ర తుఫానుగా మారుతుందని వెల్లడించింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సెంట్రల్వాటర్ మిషన్‌తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.