Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎజెండాలో నష్ట పరిహారం కోత..!
- కరోనా ఉత్పత్తులపై పన్నులు రద్దు
న్యూఢిల్లీ : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకు వచ్చింది. ఈ నెల 28న న్యూఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. కరోనా సాకు పేరుతో ఇప్పటికే రెండుసార్లు ఈ నిబంధనను ఉల్లంఘించారు. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు కేంద్రం దిగి వచ్చింది. 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ నెల 28న వీడియో కాన్పరెన్స్ ద్వారా జరుగుతుందని శనివారం నిర్మల సీతారామన్ ఆఫీస్ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కరోనా వల్ల రాష్ట్రాల ఆదాయాలు అమాంతం పడిపోయాయి. జీఎస్టీ చట్ట ప్రకారం.. ఆయా రాష్ట్రాలకు కేంద్రం నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీలో ప్రధానంగా పరిహారం కోత, రుణ అవసరాలు, కోవిడ్ ఆధారిత ఉత్పత్తులపై పన్ను రాయితీలు, రద్దుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.