Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయంతో వణికిపోతున్న స్థానికులు
- అవి..కోవిడ్ మరణాలేనని అనుమానాలు !
న్యూఢిల్లీ : కోవిడ్ వైరస్ విజృంభణ కారణంగా ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తూర్పు యూపీలో గంగా నది తీరానికి పదుల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకువసు ్తన్నాయి. తూర్పు యూపీ జిల్లాలో గంగా నదిలో వదిలేసిన మృతదేహాలు బీహార్‌లో తేలుతున్నాయి. ఈ తరహా మృతదేహాల్ని బక్సర్ (బీహార్) జిల్లాలో 71వరకు గుర్తించినట్టు స్థానిక అధికారులు తాజాగా వెల్లడించారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పదుల సంఖ్యలో తేలియాడుతున్న మృతదేహాలు మళ్లీ కనిపించాయి. కొన్ని మృతదేహాలు ఘాట్ల వద్దకు కొట్టుకొచ్చాయి. మంగళవారం ఇదే ప్రాంతంలో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. అంతకుముందు రోజు బీహార్‌లోని బక్సర్ జిల్లాలో గంగానదిలో తేలియాడుతున్న మృతదేహాలు కనిపించాయి. ఇవి కోవిడ్‌తో మృతిచెందిన వారివేనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఘాజీపూర్‌లో మృతదేహాలు కనిపించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుళ్లిన స్థితిలో ఉన్న ఈ మృతదేహాల వల్ల వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. నదిలోని అన్ని వైపులా మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయని, కొన్ని ఘాట్ల వద్దకు కొట్టుకువచ్చాయని చెబుతున్నారు. వాటి నుంచి దుర్వాసన వస్తోందని, పరిస్థితి భయానకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాల పరిస్థితి చూస్తుంటే అవి గత నాలుగైదు రోజులుగా నదిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. బహుశా ఇవి చందౌలీ వైపు నుంచి కొట్టుకుని వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో నదికి సమీపంలోని ఇసుకలో కొన్ని మృతదేహాలను పూడ్చిపెట్టిన ఘటన వెలుగుచూసింది. ఇటువంటి ఘటనలు వెలుగుచూసినప్పుడల్లా స్థానికులు భయంతో వణికిపోతున్నారు. అయితే కోవిడ్ బారినపడిన వారి అంత్యక్రియలకు శ్మశానంలో చోటు దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులే ఆ మృతదేహాలను నదిలోకి విసిరేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్ కారణంగా వేలాది మంది చనిపోతున్నారని, మృతదేహాల్ని నదీ తీర ప్రాంతాలకు తీసుకొచ్చి ఖననం చేయటం, నదిలోకి విసిరేయటం వంటివి జరుగుతున్నాయని స్థానిక హిందీ, ఇంగ్లీష్ దినపత్రికలు వార్తా కథనాలు రాశాయి. ఈ తరహా మృతదేహాల సంఖ్య దాదాపు 2వేలకుపైగా ఉంటుందని తెలిపారు. ఘజియాపూర్, కాన్పూర్, ఉన్నావో, ఘజియాపూర్, కనౌజ్, బాలియా నదీ తీర ప్రాంతాల్లో మృతదేహాలు కనిపించటం స్థానికంగా కలకలం రేపింది. ఇవన్నీ కోవిడ్ మరణాలేనని వార్తలు వెలువడ్డాయి.