Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 రాష్ట్రాల్లోనే 85 శాతం కేసులు: కేంద్రం
- వేయికిపైగా విద్యుత్ ఉద్యోగులు మృతి
- బెంగాల్లో ఈ నెలాఖరు వరకు సంపూర్ణ లాక్డౌన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,26,098 మందికి కరోనా వచ్చింది. ఇదే సమయంలో 3,890 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 2,43,72,907కు చేరగా, మరణాలు 2,66,207కు పెరిగాయి. ఇప్పటివరకు మొత్తం 2,04,32,898 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 36,73,802 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 31,30,17,193 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 16,93,093 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
ఆ రాష్ట్రాల్లో కేసులు అధికం
దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 85 శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే, 11 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయనీ, మరో 8 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో కరోనా ప్రభావం అధికంగా ఉంది.
18-44 ఏండ్లలోపు వారిలో 42 లక్షల మందికి టీకాలు
దేశంలో ఇప్పటిరకు మొత్తం 18,04,57,579 మందకి టీకాలు అందించారు. ఇందులో 60 ఏండ్లకు పైబడినవారు 39.9 శాతం, 45-60 ఏండ్లలోపు వారు 45.5 శాతం, 30-45 ఏండ్లలోపు వారు 9.4 శాతం, 30 ఏండ్లలోపు వారు 5.2 శాతం మంది ఉన్నారు. అయితే, ఇప్పటివరకు 42 లక్షల మంది 18-44 ఏండ్లలోపు వారు టీకాలు తీసుకున్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,03,625 టీకాలు వేశారు.
వేయికి పైగా విద్యుత్ ఉద్యోగులు మృతి
దేశవ్యాప్తంగా విద్యుత్ సెక్టార్‌కు చెందిన దాదాపు వేయి మందికి పైగా ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్టు ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) వెల్లడించింది. అలాగే, 15వేల మందికి పైగా ఈ వైరస్ బారినపడ్డారని తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 7100 మంది కరోనా సోకగా, వారిలో 210 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో 4000 మంది వైరస్ బారినపడగా..వారిలో 140 మంది మరణించారు. దేశ విద్యుత్ సెక్టార్ ఉద్యోగులకు వెంటనే టీకా అందించాలంటూ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌కు ఏఐపీఈఎఫ్ లేఖ రాసింది.
బెంగాల్లో ఈ నెలాఖరు వరకు లాక్డౌన్
బెంగాల్లో కరోనా కొత్త కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఆంక్షలు కొనసాగుతున్న కరోనా ప్రభావం తగ్గడం లేదు. ఈ ఈ నెలాఖరు వరకు (మే 30) వరకు పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. కేవలం అత్యవసర సేవలతో పాటు టీ తోటల్లో 50 శాతం, జనపనార మిల్లుల్లో 30 శాతం కార్మికులతో పనిచేసేలా వెసులుబాటు కల్పించింది. కాగా, బెంగాల్లో కొత్తగా 20,846 కరోనా కేసులు, 136 మరణాలు నమోదయ్యాయి.
మమత సోదరుడి కన్నుమూత
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోదరుడు ఆశిమ్ బెనర్జీ కరోనా కారణంగా శనివారం ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల వైరస్ బారినపడ్డ ఆయన కోల్‌కతాలోని మెడికా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.