Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబులెన్స్‌కు, ఆక్సీజన్‌కు వేలాది రూపాయల ఖర్చు..
- చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేని పరిస్థితి
- కోవిడ్ దెబ్బకు అప్పుల ఊబిలోకి బాధితులు
- ఎక్కడా..ఏ విషయమూ పట్టనట్టు వ్యవహరిస్తున్న పాలకులు
కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఒక దోపిడి రాజ్యం నడుస్తోంది. ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు (అంబులెన్స్‌లు నడిపేవారు, ప్రయివేటు హాస్పిటల్స్, శ్మశానవాటిక నిర్వాహకులు) బాధిత కుటుంబాల్ని దోచుకుంటున్నారు. ఇదేమని అడిగే పాలకులు లేరు. కరోనా చికిత్సకు ముందు, చికిత్సకు తర్వాత..బాధిత కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడుతున్నారు. అంత్యక్రియలకు సైతం పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంతటి భయానక వాతావరణం మన పాలకులకు కనపడటం లేదా? అంబులెన్స్ సేవలకు, ఆక్సీజన్, ఔషధాల కొనుగోలుకు ప్రయివేటు దోపిడిని భరించాల్సిందేనా? దీనిని ప్రభుత్వాలు ఆపలేవా? అని సామాన్యుడి గుండె ప్రశ్నలతో రగిలిపోతోంది.
న్యూఢిల్లీ : కరోనా రెండో వేవ్ దెబ్బకు అనేక రాష్ట్రాల్లో హాస్పిటల్ బెడ్, ఆక్సీజన్, ఔషధాల కొరత తీవ్ర రూపం దాల్చింది. ఈ సంక్షోభం..శ్మశాన వాటికల వద్ద దోపిడి, కట్టెల కొరతను సైతం సృష్టించింది. అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తే...అంత్యక్రియలకు దారులు తెరుచుకుంటున్నాయి. దేశంలో రోజుకు కరోనా మృతుల సంఖ్య 4వేలు ఉంటే ఈ తరహా పరిస్థితులుంటాయా? అన్నది నిపుణుల ప్రశ్న. చాలా పెద్ద సంఖ్యలో మరణాలు ఉన్నాయని, అందువల్లే క్షేత్రస్థాయిలో దారుణమైన దోపిడి నెలకొందని వారు చెబుతున్నారు.
కట్టెల కొరతను తీర్చలేరా?
'' స్మశాన వాటికల్లో అంత్యక్రియలకు కావాల్సిన కట్టెలు లేవు. రోజువారీ కట్టెల సరఫరా చాలా తక్కువగా ఉంది'' అని మహారాష్ట్రలోని సతారా పట్టణంలో కట్టెల వ్యాపారి రోహిత్ పర్దేశీ చెప్పారు. లాక్డౌన్ వల్ల కట్టెలు కొట్టే పనికి కూలీలు రావటం లేదని, అందువల్లే డిమాండ్‌కు తగిన సరఫరా లేదని ఆయన అన్నారు. దాంతో కట్టెల ధరలు విపరీతంగా పెరిగాయని పర్దేశీ చెప్పారు. మహారాష్ట్రలోనే కాదు, ఢిల్లీ, యూపీ, బీహార్, గుజరాత్..తదితర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అంత్యక్రియలకు బాధిత కుటుంబ సభ్యులు పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.
ఎవరికి చెప్పుకోవాలి?
ఢిల్లీలో మెడికల్ ఆక్సీజన్ కొరత తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే.అత్యవసరంగా ఆక్సీజన్ కావాలని ఎవరైనా ప్రయత్నాలు చేస్తే..ప్రయివేటులో ఒక సిలిండర్ ధర 70వేలకు అమ్మిన దాఖలా ఉంది. ఆక్సీజన్, ఔషధాలు, అంబులెన్స్ సేవల విషయంలో అధిక ధరలు వసూలు చేస్తున్నారని దాదాపు వందమందికిపైగా అరెస్టు అయ్యారు. బ్లాక్‌మార్కెట్ పెద్ద ఎత్తున ఉందని ప్రభుత్వానికి తెలుసు.అయినా పాలకుల నుంచి చర్య లు శూన్యం. సంక్షోభం నేపథ్యంలో ఎదురవుతున్న పరిస్థితుల్ని పేదలు, సామాన్యులు ఎదుర్కోలేకపోతున్నారు. ప్రభుత్వ సేవలు గగనమె పోయాయి. ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడి పోవాలి? అని వేదన చెందు తున్నారు. ఈ పోరాటంలోనే ఎన్నోవేల మంది ప్రాణాలు బలవుతున్నాయి..
నా చెల్లెలికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ దొరకలేదు. దాంతో అప్పుచేసి ప్రయివేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. రెండు వారాల చికిత్స తర్వాత ఆమె మరణించింది. ప్రాణం దక్కలేదు, అప్పులు మిగిలాయి. ఇంత తీవ్రమైన కష్టాల్లో ఆరు కి.మీల ప్రయాణం కోసం అంబులెన్స్‌కు రూ.5వేలు ఇవ్వాల్సి వచ్చింది. శ్మశాన వాటికలో వెంటనే అంత్యక్రియలు నిర్వహించడానికి మరో రూ.7వేలు ఇచ్చాను. ప్రభుత్వ వైద్యం, ఇతర సేవలు అందుబాటులో ఉంటే, నాకీ పరిస్థితి వచ్చేదా?
- అశోక్ ఖొండారే, పూణెలో కూరగాయలు అమ్ముకునే వ్యక్తి
నా స్నేహితులు, బంధువుల్లో దాదాపు 12మందికిపైగా కరోనాబారిన పడ్డారు. గత నెలరోజుల్లో వీరికి మెడికల్ ఆక్సీజన్, ఔషధాల కోసం ప్రయివేటు అమ్మకందార్లను ఆశ్రయించాల్సి వచ్చింది. సాధారణంకన్నా 20..30 రెట్లు ధరలు పెంచినా ప్రభుత్వం నుంచి అడిగేనాథుడే లేడు. బాధిత కుటుంబాలన్నీ అప్పులు చేసి కొనాల్సి వచ్చింది. బ్లాక్మార్కెట్లో అమ్మకందార్లు బాధితుల్ని జలగల్లా పీల్చేస్తున్నారు.
- అర్వీనా శర్మ, నోయిడాలో న్యాయవాది